దేశంలో 40 వేల దిగువకు తాజా కేసులు..

– 24గంటల్లో 36,469 కరోనా కేసులు

దిల్లీ,అక్టోబరు 27(జనంసాక్షి):దేశంలో కరోనా కేసులు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. తొలిసారిగా 40 వేల దిగువన కేసులు నమోదయ్యాయి. మరోవైపు రికవరీ రేటు కూడా పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. సోమవారం 9,58,116 నమూనాలను పరీక్షించగా 36,469 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,46,429గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 488 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,19,502కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 63,842 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 72,01,070 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 6,25,857 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది.

సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం జులై 23న 45,720 కేసులు నమోదు కాగా, ఆదివారం అంతకంటే తక్కువగా 45,148 కేసులులొచ్చాయి. అయితే తాజాగా కొత్త కేసుల సంఖ్య 40 వేల దిగువకు చేరడంతో దేశ వ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య భారీగానే తగ్గుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 90.23 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 8.26 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం 10,25,23,469 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.