జనంసాక్షి, మంథని : క్యాడర్ లేని కాంగ్రెస్ను కనుమరుగు చేయడమే లక్ష్యంగా గులాబీ సైనికులు పనిచేయాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేష్ పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ గార్డెన్లో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొన్ని ముందు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం అమరవీరులు, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత, మంథని నియోజకవర్గ భిఅర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధూకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు హర్షిని రాకేష్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ అమరవీరుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం ఎంపీ మాట్లాడుతూ..
నోట్ల కట్టలతో ఓట్లు దండుకునే కాంగ్రెస్ను, మతం ముసుగులో చిచ్చు పెట్టే బీజేపీని తరిమి కొట్టాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గులాబీ సైనికులను, నాయకులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి బలోపేతం చేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేస్తూ ఏకగ్రీవ తీర్మాణాలతో ముందుకు సాగాలన్నారు. 2014లో నియోజకవర్గ ప్రజలు పెద్ద తప్పు చేశారని, కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మి మంచి మనస్సున్న ప్రజాసేవకుడైన పుట్ట మధును ఓడగొట్టుకున్నారని, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మధన్నను 36 వేల బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నా అంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడు పుట్ట మధు అని, నిత్యం ప్రజల కోసం ఆలోచన చేసి వారి సంక్షేమానికి నిరంతం శ్రమించే సేవకుడని కొనియాడారు. అనేక ఏండ్లు ఈ ప్రాంతంలో పరిపాలన చేసిన పాలకులు చేసిన అభివృధ్ది, సంక్షేమం ఏదీ లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులు తెలంగాణపై వివక్ష చూపారని, అనేక కష్టాలు, కన్నీళ్లను చవిచూశామన్నారు.కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణాను ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని ఆయన గుర్తు చేశారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృధ్ది పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చారని ఆయన కొనియాడారు. మంథని నియోజకవర్గంలో పుట్ట మధూకర్పై, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ పీఠాన్ని సీఎం కేసీఆర్ అధిరోహిస్తారనే భయం బీజేపీకి పట్టుకుందని, ఈ క్రమంలో ప్రజాస్వామ్యబద్దంగా గెలిచే సత్తాలేక ఈడీ దాడుల పేరుతో మానసికంగా దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణాపై ఇప్పటికి వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. రైతు కష్టం తెలిసిన రైతుబిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. పంట పొలాలకు వెళ్లి ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమా పేరుతో రూ.5 లక్షలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. గడిచిన ఎనిమిది ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయో వాటిలో ఏవైనా గత ప్రభుత్వాలు అమలు చేశాయా అని ఆలోచన చేయాలన్నారు. గడపగడపకు అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, అవసమైతే కాంగ్రెస్ కార్యకర్తల ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వనించాలని ఆయన సూచించారు. నిత్యం ప్రజలకోసం ఆలోచన చేసే పుట్ట మధును ఆదరించాలని, ఏసీ గదుల్లో ఉంటూ పోలీస్ బలగాల మధ్య తిరిగుతూ అధికారం కోసం ఆరాటపడే నాయకుడు కావాలా లేక నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సేవకుడిలా ఉండే నాయకుడు కావాలో గులాబీశ్రేణులు ఆలోచన చేయాలన్నారు. దేశానికి గులాబీ కండువా, సీఎం కేసీఆర్ శ్రీరామ రక్షఅని రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సన్నద్దం కావాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.




