Tuesday, 3 November 2026

దేశానికి ముందుచూపునిచ్చింది ఎస్సీలు, బీసీలే – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్

జనంసాక్షి, మంథని : పోరాటాలు, త్యాగాలతో దేశానికి ముందు చూపునిచ్చింది ఎస్సీ, బీసీ సామాజికవర్గానికి చెందిన మహనీయులేనని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ప్రెస్‌అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ తో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆనాడు మనకోసం మన భవిషత్‌తరాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్పూర్తిని మర్చిపోవడం మూలంగానే 40 ఏండ్లుగా ఇంకా బానిసలుగానే ఉంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకున్నామని, అలాంటి మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత అందిరపై ఉందన్నారు. ఎంతో మంది మహనీయులు వందేళ్ల క్రితమే మన భవిష్యత్‌ తరాల కోసం ఆలోచన చేశారని, కానీ ఈనాడు అధికారం, ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా నాయకులు పనిచేస్తున్నారని, కనీసం ఆకలి తీర్చాలనే ఆలోచన చేయడం లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బాబు జగ్జీవన్‌రాం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినప్పటికి గొప్పగా ఆలోచన చేసి దళితుల కోసం పాటుపడ్డారని, వారికి రైల్వేలో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించిన మహనీయుడని కొనియాడారు. ఆదివాసీ బిడ్డ కొమురంభీం జల్‌ జంగిల్‌ జమీన్‌ నినాదంతో బ్రిటిష్‌వారిపై పోరాటం చేశారని, ఆయన ప్రపంచానికే ఆదర్శమన్నారు. అలాగే మేము పండించిన పంటకు శిస్తు ఎందుకు కట్టాలని చాకలి ఐలమ్మ తిరుగుబాటు చేసిందని, ఆనాటి ఆమె స్పూర్తి దేశానికి వెలుగులు ఇచ్చాయన్నారు. దళితుల కోసం నిరంతం కృషిచేసిన గుడిసెల వెంకటస్వామి గొప్ప నాయకుడని, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన సింగరేణిలో పెన్షన్‌ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించాలనే ఆలోచనతో పోరాటం చేసిన బీపీ మండల్‌లాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని వారి చరిత్రను చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగానే మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. మంథనిలో ప్రోఫెసర్‌ జయశంకర్‌సార్‌, కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన కోసం మన భవిషత్‌ తరాల కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన వారిలో ఎక్కువగా బీసీలు, ఎస్సీలే ఉన్నారని, వారి త్యాగాల ఫలితంగానే ఈనాడు మనం అనేక ఫలాలు అనుభవిస్తున్నామని అన్నారు. 40 ఏండ్లు ఈ ప్రాంతంలో అధికారంలో ఉండి ఈ ప్రాంత ప్రజలకు గత పాలకులు ఏమీ చేయలేదని, తన తండ్రి విగ్రహాలు పెట్టి మొక్క మన్నారే కానీ మహనీయుల గురించి చెప్పలేదన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్వంత గ్రామంలో ఎంత మంది పేదోళ్లకు ఇండ్లు కట్టించారని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని భూపాలపల్లి జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని ఆయన అన్నారు. 40 ఏండ్ల క్రితమే శ్రీపాదరావు తల్లి ఎంతో మంది పేదోళ్లకు చల్ల పోసిందని కాంగ్రెస్‌ నాయకులు గొప్పలు చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఈనాడు తమ నాయకుడు పది మంది అన్నం పెట్టాడనో, నాలుగురి సాయంచేశాడనో చెప్పుకోకుండా 50 ఏండ్ల కిందట చల్ల పోసిండ్లని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారం కోసం పదవుల కోసం పరితపించే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఆనాడు మనకోసం త్యాగాలు చేసిన మహనీయులే మనకు స్పూర్తి అని వారి చరిత్రపై చర్చ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.