Tuesday, 3 November 2026

విగ్రహాల ఏర్పాటు ఆలోచన చాలా గొప్పది – దొడ్డి కొమురయ్యలేకపోతే ఈనాడు తెలంగాణ ఉండేది కాదు

జనంసాక్షి, మంథని : ఇన్నేండ్ల చరిత్రలో ఏనాడు ఎక్కడా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికి రాలేదని, మంథనిలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు ఆలోచన రావడం చాలా గొప్పదని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. మంథని పట్టణంలోని బొక్కలవాగు రెండో వంతెనపై పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌ నేత, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లోకి సాధువులు, సన్యాసులు, నిచ్చెల మెట్ల కుల వ్యవస్థను తయారు చేసిన మనువు విగ్రహాన్నిపెట్టి పార్లమెంట్‌ ఓపెన్‌చేశారని ఆయన వివరించారు. వైవిద్యంగా కాలాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కేంద్రంలోని ప్రభుత్వంతో పాటు కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ మాత్రం మహనీయుల చరిత్రను చాటిచెప్పాలని, భవిష్యత్‌ తరాలకు బంగారుబాటలు వేయాలని ఆలోచనతో మహనీయుల విగ్రహనీయుల విగ్రహాలు పెడుతూ బహుజన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, ఇదే రేపటి వాస్తవమని ఆయన తెలిపారు. మంథని లాంటి ప్రాంతంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టాలని, విగ్రహాల ఏర్పాటుతో స్పూర్తి వస్తుందని, భవిష్యత్‌ నిస్తాయని, చూపుడు వేలుతో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ విగ్రహాలు దారి చూపిస్తాయని ఆయన అన్నారు. మంథని లాంటి బ్రాహ్మణులు ఉండే ఈ ప్రాంతంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బీపీ మండల్ కొమురంభీం విగ్రమాలను నిలబెట్టడం చరిత్రగా బావిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇన్ని రోజులు ఏ కులాలైతే అణిచివేతకు గురయ్యాయో ఆ అట్టడుగువర్గాలు లేచి నిలబడకపోతే భవిష్యత్‌ ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు మార్గదర్శకులుగా నిలిచిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురించి చెప్పలేదని, చూపించలేదని. ఆయన చరిత్రను మూసిపెట్టిండ్లని ఆయన తెలిపారు. ప్రపంచ మేధావుల్లో అంబేద్కర్‌ నంబర్‌వన్‌ అని సమాజం చెప్తున్నా ఆయన చరిత్రను తెలియకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిన్న మతాలు, బిన్న బాషలు, బిన్నమైన సంస్కృతి ఉన్న భారత దేశంలో మనువు ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తయారు చేసిందని, పుట్టుకతోనే మనం అంటరానీ వాళ్లమని, వాళ్లతో కలిసి బోజనం చేయలేని వాళ్లమని, ఇండ్లలోకి పోలేని వాళ్లమనే బతుకులు మనువు నిర్థేశించాడని ఆయన తెలిపారు. స్త్రీలు చదువకూడదని మాట్లాడకూదదని బయటకు రాకూడదనే కట్టుబాట్లను పార్లమెంట్‌ మోస్తున్నసమయంలో మంథని లాంటి సంప్రదాయ బ్రాహ్మణ ప్రాంతంలో మహనీయుల విగ్రమాల ఆవిష్కరణ సాహసానికి పూనుకోవడం గొప్ప విషయమన్నారు. ఆనాడు సాయుధ పోరాటం చేసిన అమరుడైన దొడ్డి కొమురయ్య లేకపోతే తెలంగాణ లేదన్నారు. తెలంగాణ కోసం సాయుధ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్వభావం కల ప్రాంతమని, వందేళ్ల ఉద్యమాల్లో తెలంగాణ వికసించిందన్నారు. మలి దశ తెలంగాణ పోరాటంతో తెలంగాణ వచ్చిందే కానీ సమ్మక్క సారక్క నుంచి మొదలుకుంటే మన దగ్గరి పోరాట సంప్రదాయం 50 60ఏండ్ల తర్వాత కూడా పోరాట వారసత్వంతోనే తెలంగాణ సాధించుకున్నామని ఆయన వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటం లేకుంటే, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య లేకుంటే మనకు పోరాట సంప్రదాయం లేకపోతే మనం లేమన్నారు. ఆనాడు మంథనిలో గుల్కోట శ్రీరాములులాంటి వాళ్లు స్వాతంత్య్ర సమరంలో, కాంగ్రెస్‌తో కలిసి చేసిన పోరాటంలో, నాగపూర్‌ క్యాంపులో నిజాం వ్యతిరేక పోరాటాల్లో ఇక్కడ కూడా ఒక పోరాట సంప్రదాయం ఉండేదన్నారు. ఆనాడు పీవీ నర్సింహరావును తెలంగాణ ఏదని నిలదీసిన చరిత్ర మంథనికి ఉందన్నారు. తొలి తెలంగాణ పోరాటంలో మంథని ఉందని, మంథని పోరాటం ఉందన్నారు. 1969లో ఉద్యమం విఫలం కావడం కలకన్న ఉద్యమం కల్లలైన తర్వాతే నక్సల్‌బరి ఉద్యమం వచ్చిందని, రెండు మూడు దశాబ్దాలు నక్సిల్‌బరి ఉద్యమం కొనసాగిన తర్వాత మలి తెలంగాణ పోరాటం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. వివక్ష ఆదిపత్యం, వలసల మీద ఎక్కుపెట్టిందే మలి తెలంగాణ పోరాటమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుధీర్షకాలం జరిగిన పోరాటం లేదని, ఒక్క నెత్తుటి చుక్క కిందపడని ఉద్యమం ప్రపంచ చరిత్రలో లేదని, ఉద్యమం శాంతిద్వారా జరిగి విజయవంతం అయింది ఒక్క తెలంగాణ పోరాటమేనని, 1200మంది ఆత్మాహుతి చేసుకున్నారే కానీ ఒక్కరిని గాయపర్చని పోరాటం ఇదేనని ఆయన గుర్తు చేశారు. మంథనిలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో బావితరాలకు చరిత్ర తెలుస్తుందని, వారి పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. చాలా రోజుల తర్వాత తన స్వంత ప్రాంతానికి వచ్చిన తాను విగ్రహాలను చూసి ఎంతో ఆనందపడ్డానని, పుట్ట మధూకర్‌లాంటి నాయకుడు మహనీయుల చరిత్ర చాటిచెప్పడం అభినందనీయమని, మంథని ఇతర ప్రాంతాలకు దారి చూపిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.