Tuesday, 3 November 2026

దేశ, రాష్ట్ర హక్కుల రక్షణ మన బాధ్యత 

– రాజ్యాంగం గురించి యువత సంపూర్ణంగా తెలుసుకోవాలి
– సంక్షేమ పథకాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి
– రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై
– భారతదేశానిది డైనమిక్‌ రాజ్యాంగం
– తెలంగాణ సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : దేశ, రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడం ప్రజల బాధ్యత అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారం నిర్వహించిన 70వ రాజ్యాంగ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. నేడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నాళ్లు బతుకుతున్నామో కాదు.. ఎలా బతుకుతున్నామన్నదే ముఖ్యమని ఆమె తెలిపారు. రాజ్యాంగ ప్రతినిధులంతా ఇక్కడ ఉన్నారని, దేశంలోని ప్రతి పౌరుడికి మన రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన రక్షణ యువతకు చాలా వరకు తెలియదని, రాజ్యాంగం గురించి యువత సంపూర్ణంగా తెలుసుకోవాలని గవర్నర్‌ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ గౌరవాన్ని అత్యున్నత స్థితిలో నిలుపుదామని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని అన్నారు. భారతదేశానిది డైనమిక్‌ రాజ్యాంగమని, అనేకసార్లు మార్పులు, చేర్పులు జరిగాయని సీఎం గుర్తు చేశారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందన్నారు. రాజ్యాంగం ఏడు దశాబ్దలుగా పరిపుష్టంగా కొనసాగుతోందని, రాజ్యాంగ స్ఫూర్తితో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుందామన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ మాట్లాడుతూ..  రాజ్యాంగంలో పేర్కొన్న మూడు వ్యవస్థలకు కీలక బాధ్యతలు ఉన్నాయని అన్నారు. జాతి పునర్‌ నిర్మాణానికి మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఏం చేసిందనే దానికన్నా..మనం ఏం చేస్తున్నామో గుర్తించాలని చెప్పారు.
ప్రపంచంలోకెల్లా భారత రాజ్యాంగం అత్యుత్తమమైనదని ఎన్నోసార్లు రుజువైందని తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి.. భారత రాజ్యాంగ విశిష్టతను కొనియాడారు. ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే అందుకు రాజ్యాంగ గొప్పతనమే కారణం అన్నారు. పాకిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు చూసే వారికి భారత రాజ్యాంగం విలువ ఏంటో తెలుస్తుందన్నారు. రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం అన్నారు. రాజ్యాంగం రచించిన మహనీయులను స్మరించుకోవటం అదృష్టం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారత రాజ్యాంగం అందించిన వరం అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అవతరిస్తోందన్నారు.  ఈకార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.