Thursday, 5 November 2026

దైవదర్శనానికి వెళుతూ.. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

దైవదర్శనానికి వెళుతూ.. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

తల్లి కూతురు మృతి, తండ్రి కూతురుకి తీవ్రగాయాలు

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 28 రెండవ కూతురు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం తిరుపతి ఏడుకొండల వెంకటరమణ సన్నిధిలో దైవదర్శనం చేసుకొని ఆడంబరంగా పుట్టినరోజు జరుపుకోవాలని కలలుగన్న కుటుంబం సభ్యులు అందరు కలిసి దైవదర్శనానికి వెళ్తూ శుక్రవారం ప్రమాదం చోటు చేసుకొని కుటుంబమంతా చెల్లా చదరమైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని వేముల ధర్మవరం స్టేజిల మధ్య 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదండపురం ఎస్సై వెంకటస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా, బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లి తండ్రి ఇద్దరు కూతుర్లు కలిసి బాన్సువాడ నుండి తిరుపతికి దైవదర్శనానికి వెళుతుండగా మార్గమధ్యంలో ధర్మవరం స్టేజి దగ్గర ఆగివున్న ఏపీ 29 టీ 2636 నెంబర్ గల డీసీఎంను టీ యస్ 17 జె 5622 నెంబర్ గల బెలోనా కారు అతివేగంతో ఢీ కొట్టినట్లు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మి (47) రెండవ కూతురు శ్రీలత (20) అక్కడికక్కడే మృతి చెందగా కారు నడుపుతున్న తండ్రి ప్రకాష్, చిన్న కూతురు మానసకి తీవ్రగాయాలు అయినట్లు ఎస్సై తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే ఆంబులెన్స్ ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తునట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు.