చేగుంట జనం సాక్షి మే 12వాతావరణం పొడిగా ఉండడంతో పాటు గత మూడు రోజుల నుండి వర్షాలు కూడా పడడం లేనందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. గురువారం చేగుంట మండలం వడియారం లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, తూకం చేసే ప్రక్రియను పరిశీలించారు. కేంద్రంలో ఏమైనా సమస్యలున్నాయా అని నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 38 బాయిల్డ్ రైస్ మిల్లులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, మిల్లులకు వచ్చే ధాన్యంలో ఎటువంటి కోతలు విధించరాదని, మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసుకోవాలని, రైతులపట్ల నిర్లక్ష్యం వహించరాదని సూచించామని అన్నారు. బాయిల్డ్ రైస్ అంటే 68 శాతం రావాలని, కానీ అకాల వర్షాలవల్ల ధాన్యం కాస్త చెడిపోయిన, తాళ్లు అధికంగా ఉన్న 60 శాతం పైగా వస్తుందని, అయినా ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యాల్లో ఎటువంటి కొత్త విధించరాదని మిల్లర్లను హెచ్చరించామని అన్నారు. కేంద్రం ఇంచార్జీలు ధాన్యం తూకం చేసిన వెంటనే కేటాయించిన మిల్లులకు తరలించేలా లారీలను మానిటరింగ్ చేయాలని అన్నారు. వి.ఆర్.ఏ. లు కూడా మిల్లుల వద్ద ఉండి ధాన్యం వచ్చిన వెంటనే దించుకునేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. గన్ని సంచులు, లారీల సమస్యలుంటే ఆర్.డి.ఓ. మండల నోడల్ అధికారి, తహశీల్ధార్ లకు తెలిపి వెంటనే పరిష్కరించు కోవాలన్నారు. టాబ్ ఎంట్రీ కూడా 80 శాతం పైగా ఖచ్చితంగా చేసేలా చూడాలని అన్నారు. కొనుగోలు ప్రారంభంలో ధాన్యం భద్రపర్చుటకు కాస్త ఇబ్బందులు తలెత్తిన ప్రస్తుతం స్థలాభావం కొరత లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి రోజు ధాన్యం సేకరణ ప్రక్రియపై మానిటరింగ్ చేస్తూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నామని కలెక్టర్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లా 388 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 9,476 మంది రైతుల నుండి 81 కోట్ల 27 లక్షల విలువ గల 39,451 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేసి 17 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశామని, త్వరలో మిగతా రైతులకు ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి జయరాజ్, తహశీల్ధార్ లక్ష్మణ్ బాబు, ,వ్యవసాయాధికారులు, కేంద్రం నిర్వాహకులు తదితరులున్నారు.





