Thursday, 5 November 2026

మెదక్ జిల్లాలో కంటి వెలుగు శిబిరాలకు ప్రజల్లో మంచి స్పందన మెదక్ జిల్లా కలెక్టర్ కంటి వెలుగు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

 

 

 

 

 

 

 

చేగుంట జనం సాక్షి మే 12జిల్లాలో కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నదని, చక్కగా వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గత జనవరి 19 నుండి నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల పట్ల ప్రజలకు అవగాహన ఉండడంవల్ల స్వచ్ఛందంగా శిబిరాలకు తరలివస్తు నేత్ర పరీక్షలు చేసుకుంటున్నారని అన్నారు. గురువారం మాసాయిపేట మండలం పోతన్ పల్లి గ్రాంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని, నర్సరీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శరీరంలో అత్యంత సున్నితమైనది కళ్ళని, వయస్సు పైబడుతున్న, చూపు మందగిస్తున్న వారు అలక్ష్యం చేయక వెంటనే కంటి వెలుగు శిబిరాలలో ఉచితంగా నిర్వహిస్తున్న నేత్ర పరీక్షలు చేసుకొని సరైన కళ్ళ జోడు వాడాలని అన్నారు. ఈ సందర్భంగా రెండవ టేబుల్ వద్ద కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, రికార్డులను, కంటి అద్దాలు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీడింగ్ అద్దాలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవాలని, కంటి పరీక్షలు మూడు మీటర్ల దూరం నుండి పరీక్షించి అవసరమైన వారికి రీడింగ్ అద్దాలు వెంటనే అందించాలని, ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డర్ పెట్టి వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తల ద్వారా పంపిణి చేయాలని సూచించారు. ప్రతి రోజు లక్ష్యం మేరకు నేత్ర పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలని సూచించారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 75 మునిసిపల్ వార్డులకు గాను ఇప్పటి వరకు 395 జిపిలు, 70 వార్డులలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి 3,95,977 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 42,498 మందికి రీడింగ్ అద్దాలు, 33,897 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామని అన్నారు.కాగా ఇప్పటి వరకు నేత్ర పరీక్షలుచేసుకున్నవారిలో 3,09,759 మందికి ఎటువంటి సమస్యలు లేవని నిర్దారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 26 జిపిలు, 3 వార్డులలో శిబిరాలు కొనసాగుతున్నాయని, ఈ శిబిరాలు జూన్ 15 వరకు కొనసాగుతాయని అన్నారు.
అనంతరం నర్సరీని పరిశీలించి ఇంటింటికి ఆరు రకాల మొక్కల పంపిణీకి పెంచుతున్న పండ్లు, పూల మొక్కలను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు టేకోమా, కానుగ వంటి మొక్కలు పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందు నాయక్, మండల ప్రత్యేకాధికారి జయరాజ్, తహశీల్ధార్ మాలతి, ఎంపిడిఓ, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు