Wednesday, 4 November 2026

నాలుగేండ్లలో 40ఏండ్ల చరిత్రను బద్దలు కొట్టినం – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

 జనంసాక్షి, మంథని : అభివృధ్ది నిరోధకులుగా కుట్రలు కుతంత్రాలకు కేరాఫ్‌గా నిలిచే కాంగ్రెస్‌పార్టీ దేశానికి పట్టిన శని అని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ విమర్శించారు. ఎల్‌ఐసీ సంస్థలో అత్యధిక భీమా పాలసీలు చేసి భీమా గ్రామ గా ఎంపికైన మంథని మండలం రచ్చపల్లి గ్రామానికి సంస్థ ద్వారా మంజూరైన రూ.75వేలతో చేపట్టిన సెంట్రల్‌ లైటింగ్‌ మరియు గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన 75ఏండ్లలో సింహబాగం సుమారు 50ఏండ్లకు పైచిలుకు దేశంలో రాష్ట్రంలో పరిపాలన చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు దేశం రాష్ట్రంలో అభివృధ్ది గురించి ఆలోచన చేయలేదన్నారు. అలాగే 40 ఏండ్లు మంథని నియోజకవర్గాన్ని పరిపాలన చేసిన ఒక్క కుటుంబం కూడా అభివృధ్దిని ఆకాంక్షించలేదని, దేశానికి, మంథనికి పట్టిన శని కాంగ్రెస్‌ పార్టీనేనని ఆయన ఎద్దేవా చేశారు. 40ఏండ్ల క్రితం అధికారంలో ఉన్నా కాంగ్రెస్‌ పాలకులు ఆలోచన చేసి అబివృధ్ది చేసి ఉంటే ఈనాడు ఇంకా గొప్పగా అభివృధ్ది జరిగేదని ఆయన అన్నారు. అలాగే సింగరేణి ప్రభావిత గ్రామాలను పట్టించుకోలేదని, నాగేపల్లి నుంచి మొదలు పెద్దంపేట, సింగరెడ్డిపల్లి, చందనాపూర్‌, మంగలిపల్లి, లద్నాపూర్‌, అక్కెపల్లి గ్రామాలను సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకుంటే నిర్వాసితులకు కనీస న్యాయం చేయాలని ఆలోచన చేయలేదన్నారు. ఒక్క గ్రామాన్ని తీర్చిదిద్దిన దాఖలాలు గత పాలకులకు లేవని, సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకున్నగ్రామాల్లోని ప్రజలు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు చెల్లాచెదురయ్యారని ఆయన గుర్తు చేశారు. నాగేపల్లి గ్రామాన్ని సింగరేణి స్వాధీనం చేసుకున్న30 ఏండ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో సర్పంచ్‌, ఎంపీటీసీ సహకారంతో రచ్చపల్లి నిర్వాసిత గ్రామాన్ని మరోచోట పొందుపర్చి గొప్పగా తీర్చిదిద్దామని, 99 శాతం గ్రామస్తులు ఒకే చోట ఉంటున్నారని ఆయన అన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అనేక అభివృధ్ది కార్యక్రమాలు చేశామన్నారు. ఖమ్మంపల్లి, ఓడేడ్‌, మహదేవ్‌పూర్‌లో అనేక బ్రిడ్జిలు, రహదారులు నిర్మించుకున్నామన్నారు. 40ఏండ్లు అధికారంలో ఉన్న దుద్దిళ్ల కుటుంబం కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం పరితపించారే కానీ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. ఒక బీసీ బిడ్డగా బీద కుటుంబంలోంచి వచ్చిన సర్పంచ్‌ కనవేన శ్రీనివాస్‌ ఆలోచించినట్లుగా ఉన్నత కుటుంబంలో పుట్టిన ఎమ్మెల్యే ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. తన గ్రామాన్ని అభివృధ్ది చేసుకోవాలనే ఆలోచన, తపనతో సింగరేణి అధికారుల సహకారం, ఇతరత్రా నిధులను సేకరించి అభివృధ్ది చేసుకుంటున్నాడని, కేవలం ప్రభుత్వం నుంచే నిధులు రావాలని వేచి చూడకుండా కొలమానం లేకుండా అవకాశం ఉన్నచోటి నుంచి నిధులు సేకరించి అభివృధ్దిలో ఆదర్శంగా నిలుస్తున్నాడని ఆయన సర్పంచ్‌, ఎంపీటీసీలను అభినందించారు. నాలుగేండ్ల అవకాశం వస్తే 40ఏండ్ల గత పాలకుల చరిత్రను బద్దలు కొట్టామని ఆయన వివరించారు. గ్రామంలో ఎక్కువగా భీమా పాలసీలు చేశారని సంస్థ కాపాడుతున్నారని, మన కోసం మన కుటుంబం కోసం అనే సందేశం ముందుకు వెళ్లాలనే ఆలోచనతో సంస్థ భీమా గ్రామ్‌ ద్వారా రూ.75వేలు మంజూరీచేయడం అభినందనీయమని,ఈ నిధులను గ్రామాభివృధ్దికి వెచ్చించడం గొప్ప ఆలోచన అని ఆయన అన్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, వార్డుసభ్యుల సహాకారంతో గ్రామాన్నిమరింత అభివృధ్దిపథంలోకి తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.