జనంసాక్షి, మంథని : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన లారీలను మిల్లర్లు త్వరితగతిన దిగుమతి చేసుకొని వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతానికి సహకరించాలని పెద్దపల్లి డిసిఎస్ఓ తోట వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని మండలంలోని రైస్ మిల్లుల వద్ద దిగుమతి కాకుండా ఉన్న లారీలను డిసిఎస్ఓ తోట వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మిల్లర్లతో మాట్లాడి శనివారం లారీలోని ధాన్యాన్ని దిగుమతి చేయించారు. ఇందులో భాగంగా మంథని ఏఎంసి సెంటర్ ను సందర్శించి దిగుమతి కాని లారీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గానూ రైస్ మిల్లర్లు వెనువెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకొని రైతన్నలకు సహకరించాలని అన్నారు. వీరి వెంట సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సూపర్ వైజర్స్, తదితరులు ఉన్నారు.
ధాన్యం లారీలను త్వరితగతిన మిల్లర్లు దిగుమతి చేసుకోవాలి – డిసిఎస్ఓ తోట వెంకటేశ్వర్లు




