బెల్లంపల్లి, ఫిబ్రవరి 9, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని షాదీఖానాకు కేటాయించిన భూమి కబ్జాకు గురైంది. కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అట్టి భూమి మాదేనని కబ్జాకు ఒడిగట్టారు.
1999 లో షాదీఖానాకు రెండెకరాల భూమి కేటాయింపు జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు భూమి అప్పగించారు. కాగా ఇదే భూమి నకిలీ పత్రాలతో2004 లో ఓ మహిళకు పట్టా జారీ అయినట్లు సృష్టించి కబ్జా చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బుధకలన్ శివారు సర్వే నెంబర్ 170 పీపీ భూమిలో 2 ఎకరాలను రెవెన్యూ శాఖ కేటాయించింది. అంతేకాకుండా షాదీఖానా నిర్మాణం కొరకు మైనార్టీ సంక్షేమ శాఖ రూ. 7.50 లక్షలు మంజూరు చేయగా, కేవలం రూ, 3.15 లక్షలు విడుదల చేసింది. దీంతో విడుదలైన డబ్బులతో కొంత వరకు షాదీఖానా నిర్మించి మధ్యలోనే నిలిపివేశారు. బెల్లంపల్లి పట్టణం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, పట్టణంలో సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లస్థలాలకు పట్టాలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్టణంలో భూములకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో భూకబ్జా దారులు కొన్నేళ్ళుగా ఖాళీగా ఉన్న షాదీఖానాభూమి పై కన్నేసి ఈ భూమిని ఆక్రమించి పట్టా చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
1999 సంవత్సరం జూన్ 29 న పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆసిఫాబాద్ కు నాడు బెల్లంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ 1 ఎన్ సుధాకర్ సంతకంతో ఉన్న జిమ్మపత్రికను పిఆర్ ఈఈ కి అందజేశారు. షాదీఖానా భూమిని కబ్జా చేసిన కొందరు వ్యక్తులు ఆభూమిని స్వంతం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెప్పడం తో 2004 ఏప్రిల్ 18 ఆదివారం నాడు ఓ మహిళ పేరున పట్టా కూడా రెవెన్యూ శాఖ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నకిలీపట్టా పై పట్టణానికి చెందిన ఓ వ్యక్తి షాదీఖానా భూముల పై, షాదీఖానా మంజూరు పై వివరాల కొరకు రెవెన్యూ శాఖ కు సమాచార హక్కు చట్టం ద్వారా దరాఖాస్తు చేయడం ద్వారా నకిలీ పట్టా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై బెల్లంపల్లి ఎమ్మార్వో వివరణ కోరగా షాది ఖానా భూమి కబ్జాకు గురవుతుందని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుత విషయాన్ని గౌరవ హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. మైనార్టీ వర్గానికి చెందిన నాయకులు మాత్రం షాదీఖానా భూమిని కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కొరకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు, పట్టా పాసుబుక్కులు చూపించి రెవిన్యూ అధికారుల అండదండలతో కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వెంటనే ఈ విషయంపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలకు పూనుకొని, ఆక్రమణదారులపై మరియు రెవిన్యూ యంత్రాంగాన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.




