Wednesday, 4 November 2026

నకిలీ పురుగు మందుల అడ్డా గుట్టు రట్టు -తూతూ మంత్రంగా అధికారుల దాడులు – ఏదేచ్ఛగా సాగిపోతున్న వ్యాపారం -రెచ్చిపోతున్న వ్యాపారులు.. నష్టపోతున్న రైతులు

 

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , మే 23 : –
ఇటీవల సంగారెడ్డి జిల్లాలో నకిలీ పురుగుమందుల ఎరువులు విత్తనాల తయారీ కేంద్రం గుట్టురట్టయింది.
సంగారెడ్డి జిల్లా అన్నిరకాల వస్తువుల నకిలీలకు, కల్తీలకు అడ్డాగా మారిందా? ఇక వ్యవసాయ రంగానికి సంబంధించైతే నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బయోలు ఇలా కాదేదీ కల్తీకి అనర్హం అన్న్టట్లుగా విచ్చలవిడి తయారీతో వీటికి అడ్డాగా తయారైంది జిల్లా పరిస్థితి. అందుకు నిదర్శనమే తాజాగా సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలో నకిలీ విత్తనాల వ్యాపారం గుట్టు రట్టయింది.అనుమతులు లేకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల తయారు చేస్తూ దర్జాగా వ్యాపారం చేస్తున్న ఉదయ్ జైన్ పై కేసు నమోదు ఐయింది.వ్యాపారిపై మోసపోయిన రైతు ఫిర్యాదుతో పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు చేసి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని వ్యాపారిపై రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దాదాపు రెండు కోట్ల పైచిలుకు నకిలీ పురుగు మందులు, విత్తనాలు స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే.. సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్‌ గ్రామంలో యథేచ్ఛగా నకిలీ విత్తనాల దందా నిర్వహిస్తున్న వ్యాపారి ఉదయ్‌ జైన్‌. ఎలాంటి అనుమతి లేకుండా శ్రీ హలమ ట్రేడింగ్‌ కంపెనీ పేరిట ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాన్ని ఏర్పాటు చేసి అందులో నకిలీ విత్తనాలు, పురుగు మందులు తయారు చేసి గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక రైతులతో పాటు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రైతులకు విక్రయిస్తున్నాడు.
ఈ విషయం వ్యవసాయ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు వాపోతున్నారు. అయితే వ్యవసాయ అధికారుల సహకారం వల్లనే ఈ కల్తీ, నకిలీల జోరు పెరిగిందనేది స్థానిక రైతుల ఆరోపణ. ఇక్కడి వ్యవసాయశాఖలో కింది స్థాయి (ఏవో) నుండి జిల్లా స్థాయి వరకూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసీ చూడనట్లు వదిలేయటం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ అధికారుల సహకారం లేకుండా నకిలీల తయారీదారుల ఆటలు సాగవనే కుండబద్దలు కొడుతున్నారు. పైగా ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి పురుగుమందుల పిచికారీకి కీలకమైన సమయంలో వ్యవసాయ శాఖ ఉద్దేశ్యపూర్యకంగానే దాడులు తగ్గించిందని ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని జిల్లా వ్యాప్తంగా ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం తాము సమర్ధవంతంగానే పని చేస్తున్నామంటున్నారు. అయితే వ్యవసాయ అధికారులు సమర్ధవంతంగానే పనిచేస్తే గత కొన్నీ సంవత్సరాలుగా ఈ నకిలీ వ్యాపారం ఎలా జరుగుతుందని రైతులు వాదన. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం రైతుల పక్షాన పలు చట్టాలను సవరించిన ఇలా నకిలీ మోసగాళ్లతో మోసపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు రైతులను నకిలీ వ్యాపారుల నుండి కాపాడాలని రైతులు కోరుతున్నారు