నగదు బదిలీతో అవినీతిని నిరోధించాం

పేదలకు నూరుశాతం ప్రభుత్వ పథకాలు
సతర్క్‌ భారత్‌..సమృద్ధ భారత్‌’ సదస్సులో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): లబ్దిదారుల ఖాతాలకు నగదు బదిలీల ద్వారా అవినీతి, కుంభకోణాలను నిరోధించగలిగామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పేదలు నూరు శాతం పొందుతున్నారని పేర్కొన్నారు. నగదు బదిలీ
ద్వారా 1,70,000 కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ఆదా చేయగలిగామని చెప్పారు. విజిలెన్స్‌, అవినీతి నిరోధక చర్యలపై ‘సతర్క్‌ భారత్‌..సమృద్ధ భారత్‌’ పేరిట మంగళవారం జరిగిన జాతీయ సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. అవినీతి నియంత్రణలో గత ప్రభుత్వాల తీరును ప్రధాని తప్పుపట్టారు. గత దశాబ్దాల్లో అవినీతి తరం శిక్షకు నోచుకోకపోవడంతో తర్వాతి తరం మరింత దూకుడుగా అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. దీంతో పలు రాష్ట్రాల్లో అవినీతి రాజకీయ సంప్రదాయంలో భాగంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తరాల తరబడి సాగిన అవినీతి దేశాన్ని చెదపురుగుల్లా తినేశాయని దుయ్యబట్టారు. నేడు ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చారు. పౌరుల జీవితాన్ని సరళతరం చేసేలా పలు పాత చట్టాలను తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు.అవినీతిపై మనం వ్యవస్థాగతంగా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అవినీతిని నియంత్రించేందుకు సామర్ద్యాలకు పదునుపెట్టడంతో పాటు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు.