బీహార్‌లో తొలి సంగ్రామం

వృద్ధులకు, కరోనా లక్షణాలు ఉన్నవారికి బ్యాలెట్‌ పద్ధతిన ఓటింగ్‌కు అవకాశం

పాట్నా,అక్టోబరు 27(జనంసాక్షి): బీహార్‌ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. ¬రా ¬రీ ప్రచారం అనంతరం రేపు ఆ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో మొత్తం 71 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 6 జిలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాల్లోని 71 నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీల తరఫున మొత్తం 1066 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో ప్రచారం సోమవారం ముగిసింది. ముఖ్య నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ¬రెత్తించారు. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలతో నేతలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. అభ్యర్థలు తరఫున జాతీయ స్థాయి ముఖ్య నేతలు సైతం ప్రచారం నిర్వహించారు.ఎన్డీఏ(బీజేపీ- జేడీయూ కూటమి) తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తదితరులు ప్రచారాన్ని నిర్వహించారు. నితీష్‌ కుమార్‌ కు మరో అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని ఓటర్లను కోరారు. ఇక కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరఫున కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, తేజశ్వి ప్రసాద్‌ యాదవ్‌ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక రెండో విడతగా నవంబరు 3 న 94 స్థానాలకు, నవంబరు 7 న మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. అలాగే నవంబర్‌ 10 న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నారు.కరోనా నేపథ్యంలో ఒక్కో బూత్‌ లో 1600 నుంచి 1000 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. 80 ఏళ్లకు పైబడిన వారు పోస్ట్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి సైతం ఆ అవకాశాన్ని కల్పించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను శానిటైజ్‌ చేశారు. పోలింగ్‌ సిబ్బందికి మాస్కులు, ఇతర రక్షణ సామగ్రిని అందించారు. థర్మల్‌ స్కానర్‌, హ్యాండ్‌ శానిటైజర్లను కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. మొదటి విడతలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.