మూడ్రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్,ఆగస్ట్15(జనం సాక్షి): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడురోజలు పర్యటనకు గురువారంహైదరాబాద్‌కు రానున్నారు. ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నగరంలో ఈ నెల 16, 17, 18వ తేదీలలో మూడు రోజుల పాటు పర్యటించనున్న సందర్భంగా ఆయన ప్రయాణించే రూట్లలో నిర్ణీత సమయాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయా రూట్లు, సమయాలలో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులకు గురికాకుండా, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు. 16వతేదీ గురువారం బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం వరకు మధ్యాహ్నం 12.20 నుంచి 1.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అదేరోజు సాయంత్రం 4.15 నిమిషాల నుంచి సాయంత్రం 5.05 నిమిషాల వరకు బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలిలోని ఓం కన్వెన్షన్ వరకు ట్రాఫిక్‌ను నయింత్రిస్తారు. సాయంత్రం 5.45 నుంచి 6.35 వరకు గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వరకు మళ్లీ ఆంక్షలు ఉంటాయి. ఇక17వ తేదీ ఉదయం 9.15 నుంచి 10.05 వరకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ హెచ్‌ఐసీసీ వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ఉదయం 10.45 నుంచి 11.35 వరకు హెచ్‌ఐసీసీ నుంచి బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వరకు మళ్లీ ఆంక్షలు ఉంటాయి. సాయంత్రం 7.05 నుంచి 8 గంటల వరకు బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి ఓం కన్వెన్షన్ వరకు కూడా ఆంక్షలు విధిస్తారు. అక్కడి కార్యక్రమం పూర్తయిన తరువాత ఓం కన్వెన్షన్ నుంచి బంజారాహిల్స్ వరకు మళ్లీ ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. 18వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 9.20 వరకు బంజారాహిల్స్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ఉంటాయి. అప్పుడు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళతారు.




