కూలిన చెట్ల తొలగింపు…జోన్లలో పర్యటిస్తున్న అధికారులు
హైదరాబాద్,సెప్టెంబర్27 (జనంసాక్షి): నగరంలో గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడంతోపాటు నీటి నిల్వలు, రోడ్లపై ఇసుక, బురద మేటలను తొలిగించడంలో జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే నగరంలోని ప్రధాన రహదారుల్లో గత రాత్రే నీటి నిల్వలను తొలిగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. రోడ్లపై గుంతలను పూడ్చివేయడం, ధ్వంసమైన మ్యాన్¬ళ్లకు మరమ్మతులు, వర్షపునీటి నిల్వలను తొలిగించడం తదితర పనుల్లో ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బంది పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ప్రతి సర్కిల్లో నీటి నిల్వల ప్రాంతాలు, కూలిన పురాతన, శిథిలావస్థ భవనాలు, గోడల వివరాలు, దెబ్బతిన్న రోడ్లు, ఏర్పడ్డ గుంతలు తదితర వివరాలను సేకరించి వెంటనే చర్యలు చేపడుతున్నారు.జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు నగరంలో విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. నగరవ్యాప్తంగా కూలిన దాదాపు 50 చెట్లను తొలిగించి రాకపోకలను సుగమం చేశారు. అదనపు కమిషనర్ సిక్తా పట్నాయక్ ఉదయం సికింద్రాబాద్ సర్కిల్లోని లాలాపేట్, వారాసిగూడ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. ఎంటమాలజీ విభాగం ద్వారా నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా లార్వా నివారణ స్పేయ్రింగ్ను చేపట్టారు.
నగరంలో యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు




