Thursday, 5 November 2026

నగరంలో 1100 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

నగరంలో 1100 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

15 నియోజక వర్గాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి

ఓటరు స్లిప్పులపై రూట్‌ మ్యాప్‌

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్‌ వెల్లడి

హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): నగరంలో 15 నియోజక వర్గాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ వెల్లడించారు. ఈవీఎంలు ఫస్ట్‌ లెవల్‌ చెక్‌ పూర్తి చేశామని, ఫస్ట్‌ లెవల్‌ ర్యాండమైజేషన్‌ ఈ నెల 12, 13 తేదీల్లో చేసి రిటర్నింగ్‌ అధికారులకు ఈవీఎంలు ఇస్తామని తెలిపారు. 15 కేంద్రాల్లో డీఆర్సీ సిస్టర్లు, ఈవీఎంలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ సిద్ధం చేశామని వివరించారు. 23 వేల మంది పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ అవసరమని, ఏపీఓలు, పీఓలకు ఈ నెల 14, 15 తేదీల్లో శిక్షణ ఇస్తామన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 1100 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని దానకిషోర్‌ వెల్లడించారు. ప్రచారం కోసం ప్రైవేటు ఆస్తులను వినియోగిస్తే నోడల్‌ ఆఫీసర్ల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. నగరంలో కేవలం ఇరవై శాతం పోలింగ్‌ అయిన కేంద్రాలు కూడా ఉన్నాయని,

ఆయా కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని చెప్పారు. పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందో సులభంగా తెలుసుకోవడానికి ఓటరు స్లిప్పులపై రూట్‌ మ్యాప్‌లను ముద్రిస్తారని దానకిషోర్‌ ప్రకటించారు. నగరంలో ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఫొటోలతో సహా ఓటరు స్లిప్పులను ముద్రించి బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ)ల ద్వారా వచ్చే నెల 1 నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు ఫారమ్‌-6 ద్వారా అక్టోబర్‌ 12 నుండి ఈ నెల (నవంబరు) 9 వరకు అందిన దరఖాస్తులు 99,226 రోల్స్‌ ఆప్డేషన్‌ జరుగుతోందని తెలిపారు. నగరంలో మొత్తం 3866 పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయన్నారు. ఈ ఎన్నికలలో దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని దానకిషోర్‌ చెప్పారు. దివ్యాంగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, వాదా యాప్‌ ద్వారా మరింత చేరువ అవుతున్నామని వివరించారు. 11 వేల మంది వికలాంగులకు కొత్తగా ఓటు హక్కు కల్పించామన్నారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద ర్యాంపులు, వీల్‌ ఛైర్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్‌ రోజున దివ్యాంగులకు రాను, పోను ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సౌకర్యాల కల్పనను సమన్వయం చేసుకోవడంలో బీఎల్‌ఓలను బాధ్యులుగా చేస్తున్నామని అన్నారు. పోస్టల్‌ ఓట్స్‌ 30 వేలు ఉంటాయని అంచనా వేస్తున్నామని, వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని చెప్పారు. ఎంసీసీ పటిష్ట అమలుకు కృషి చేస్తున్నామని, సి-విజిల్‌, ఈ-సువిధ, వాదా యాప్స్‌ వాడుతున్నామని వివరించారు. పోలీసుల వైపు నుంచి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని దానకిషోర్‌ చెప్పారు. ఎన్నికల సిబ్బందితోపాటు ఇతర సంస్థలతో, పిల్లల ద్వారా పేరెంట్స్‌ కు చెప్పేలా పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు చెందిన 8మంది పరిశీలకులు, జనరల్‌ అబ్జర్వర్స్‌ కూడా త్వరలో వస్తారని వెల్లడించారు. 102 కేంద్రాలలో ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ పై అవగాహన కల్పిస్తున్నామని, కొత్తగా మరిన్ని పోలింగ్‌ కేంద్రాలలోనూ ఈ ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని ఓటర్లకు 3 లక్షల ఎపిక్‌ కార్డ్స్‌ ప్రింట్‌ అవుతున్నాయని, వాటిని త్వరలో పంచుతామని దానకిషోర్‌ వెల్లడించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ నుండి వెబ్‌ కాస్టింగ్‌ చేస్తామని దానకిషోర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రం అడ్రస్‌ తెలుసుకునేందుకు యాప్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎపిక్‌ కార్డు నెంబర్‌ ను యాప్‌ లో ఎంటర్‌ చేస్తే అడ్రస్‌ తెలుస్తుందన్నారు. ఓటర్‌ లిస్టులో పేరు ఉన్న వారికి ఎపిక్‌ కార్డు ఫ్రీగా ఇస్తామన్నారు.