వెండితెరపై ‘ఎర్రమల్లెలు’ పూయించిన కర్షకుడు
నక్సలైట్లు ప్రభావం చూపుతున్న తరుణం అది. అడవిలో అన్నలు… సమాజంలోని అంతరాలను ప్రశ్నిస్తున్న రోజులవి. సినీ ఇండస్ట్రీలో ప్రేమ కథలు, కుటుంబ కథలు రాజ్యమేలుతున్న కాలంలో విప్లవభావాలతో ‘ఎర్ర’ సినిమాలను తెరకెక్కించేందుకు ఓ వీరుడు వచ్చాడు. ఎరుపు రంగునే తన ఆయుధంగా మలుచుకుని.. వామపక్ష భావజాలంతో సమాజ అభ్యుదయమే ధ్యేయంగా సినిమాలు నిర్మిస్తూ… నటిస్తూ.. రెడ్ స్టార్‌గా ఎదిగారు. ఆయనే మాదాల రంగారావు. నేడు ఈ ఎర్ర సూర్యుడు అస్తమించాడు.
ప్రకాశం జిల్లా మైనం పాడులో 1948 మే 25న జన్మించిన ఈయన తన భావాలకు అనుగుణంగా సినిమాలను నిర్మించారు. ‘చైర్మన్ చలమయ్య’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు మాదాల రంగారావు. ఆ తరువాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తొలిసారిగా ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని తీసి మొదటిసారిగా బంగారునంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంస్థలో.. ఎర్ర మల్లెలు, మహాప్రస్థానం, ప్రజాశక్తి, విప్లవ శంఖం, స్వరాజ్యం, తొలిపొద్దు, ప్రజాశక్తి, ఎర్రసూర్యుడు లాంటి విప్లవ సినిమాలనే నిర్మించారు. తన సినీ జీవితాన్ని తాను నమ్మిన సిద్ధాంతానికే అంకితం చేశారు. వామపక్ష భావాజాలానికి అనుగుణంగానే సినిమాలను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించేవారు.
ప్రస్తుత తరానికి ఆర్. నారాయణమూర్తి గురించి మాత్రమే తెలుసు. కానీ 80,90ల్లోనే విప్లవ సినిమాలకు నాంది పలికిన యోధుడు రంగారావు. కమ్యూనిస్టు పార్టీతో సాన్నిహిత్యంగా మెలిగేవారు. ప్రజానాట్య మండలిలో క్రియాశీల సభ్యుడిగానూ వ్యవహరించారు. నేడు ఈ ఎర్ర నక్షత్రం కానరాకుండా పోయింది. రంగారావు మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
విప్లవం అంటే రక్తపాతమేనా? విప్లవం అంటే తుపాకులేనా? విప్లవం అంటే ప్రాణాలు తీయడం.. ప్రాణాలు పోగొట్టుకోవడమేనా? అని ప్రశ్నిస్తే
‘హింస మా వృత్తి కాదు. హింస మా అభిమతం కాదు.. హింస మా ఆశయం కాదు. అన్ని రకాల హింసలకు అంతం పలకాలనే యుద్ధం నడుపుతున్నాం. మా యుద్ధం శాంతి కోసం.. మా యుద్ధం సమానత్వం కోసం.. ఈ దేశంలోని సువిశాలమైన భూములను, సహజ సంపదలను కొంతమంది ధనస్వాములు తమ స్వార్థానికి బలి చేస్తుంటే, ఆ సహజ సంపదలను ప్రజలందరి సొత్తు చేయడమే మా లక్ష్యం. పేద రైతులను, కూలీలను, కార్మికులను దోచుకుతింటూ.. వాళ్లకు ఆకలిని, అశాంతిని, ఉరికొయ్యలను, చెరసాలలను ప్రసాదించే ఈ కుళ్లిన కుట్ర వ్యవస్థను మేమింకా క్షమించదలచుకోలేదు. దానికి శస్త్ర చికిత్స చేయడానికే మేమీ యుద్ధం చేస్తున్నాం. అదే మమ్మల్ని తుపాకులను పట్టుకునేలా చేసింది’ అంటూ విప్లవానికి నిర్వచనం ఇస్తారు మాదాల రంగారావు.
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మాదాల రంగారావు వెండితెరపై విభిన్న పాత్రలు పోషించారు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం వంటి విప్లవ భావాలున్న సినిమాలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన నటించిన ‘మరో కురుక్షేత్రం’ సినిమా పట్టాలెక్కడం చాలా విచిత్రంగా జరిగింది. ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాత. దర్శకరత్న దాసరి నారాయణరావు మీద కోపంతో ఈ సినిమాను మొదలు పెట్టారు భరద్వాజ్.
దాసరి నారాయణరావుతో తమ్మారెడ్డి భరద్వాజ్‌కు మంచి అనుబంధం ఉండేది. ఆ స్నేహంతోనే రేలంగి నరసింహారావు దర్శకుడిగా ఓ సినిమా చేయమని భరద్వాజ్‌ను కోరారు. అప్పుడు ‘మరో కురుక్షేత్రం’ కథను సిద్ధం చేసుకుని, దాసరికి వినిపిస్తే నచ్చలేదని చెప్పారు. దీంతో కోపం వచ్చిన భరద్వాజ్ ఆ కథతో చిరంజీవి, కృష్ణంరాజులను పెట్టి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈలోపే పేపర్‌లో ‘మరో కురుక్షేత్రం’ షూటింగ్ ప్రారంభం అంటూ ప్రకటన చూసి, భరద్వాజ్‌కు మరింత కోపం వచ్చింది. అదే సమయంలో తన ఇంట్లో భోజనం చేస్తున్న మాదాల రంగారావుతో ‘రేపటి నుంచి సినిమా చేద్దామా’ అని అడిగితే, ‘నువ్వు సరే అంటే ఒకే’ అని మాదాల రంగారావు సమాధానం ఇవ్వడంతో వారం రోజుల్లో ‘మరో కురుక్షేత్రం’ సినిమా మొదలు పెట్టారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో దాసరిని తమ్మారెడ్డి భరద్వాజ్ తిట్టడం, పెద్దలు జోక్యం చేసుకుని ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడం పెద్ద తతంగమే జరిగింది. అలా మాదాల రంగారావు ‘మరో కురుక్షేత్రం’తో తెరకెక్కింది.
అంతకుముందే మాదాల రంగారావు ‘ఛైర్మన్ చెలమయ్య’. ‘యువతరం కదిలింది’ సినిమాలను తీశారు. నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై 1980 లో తీసిన ‘యువతరం కదిలింది’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది పురస్కారం లభించింది. ఈ సినిమాకు ప్రేరణ అప్పట్లో సంచలనం సృష్టించిన కంచికచర్ల కోటేశ్ హత్య. ఈ సినిమాకు దర్శకుడిగా వి.మధుసూదనరావును అనుకున్నారు. అప్పట్లో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న సినిమాలకు వీఎమ్మార్ పెట్టింది పేరు. మాదాల రంగారావు కూడా అదే ఆలోచించారు. బొల్లిముంత శివరామకృష్ణ రచయితగా అనుకున్నారు. అయితే అప్పుడు మధుసూదనరావు ఎన్టీఆర్‌తో సూపర్‌మ్యాన్ తీసే పనిలో బిజీగా ఉండటంతో ఆయనను పక్కన పెట్టి, ధవళ సత్యం సినిమా తీయడానికి అడుగులు వేశారు. ‘యువతరం కదిలింది’, ‘ఎర్రమల్లెలు’ సినిమాలు విజయం సాధించగా, ‘మరో నాలుగు సినిమాలతో విప్లవం తీసుకువస్తా’ ప్రకటనలు చేశారట మాదాల రంగారావు. ‘ఎర్రమల్లెలు’ సినిమాలో ‘నాంపల్లి టేసును కాడా రాజా లింగో’.. ఎస్పీ శైలజ పాడిన తొలి పాట కావడం విశేషం. అందులో మాదాల రంగారావు తనయుడు మాదాల రవికుమార్ ఈ పాటతోనే వెండితెరకు పరిచయం అయ్యారు.
మాదాల రంగారావు సినిమాలు వరసగా హిట్టవుతున్న సందర్భంలో గిరిబాబు కూడా మాదాలతో ‘పొలికేక’ అనే సినిమా ప్రకటించారు.
సరిగ్గా అప్పుడే మహాప్రస్థానం, ప్రజాశక్తి సినిమాలు అపజయం పాలవ్వడంతో అది పక్కకు వెళ్లిపోయింది. ఇక నారాయణమూర్తి హవా నడుస్తున్న కాలంలో కల్యాణరావు నాటకం ‘తొలిపొద్దు’ తీశారు. అదీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సినిమాలను పక్కన పెట్టేసి, సీపీఐ తరఫున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేవారు. తొలి రోజుల్లో ఎన్టీఆర్ మీద గట్టి విమర్శలు చేస్తూ ప్రచారం చేశారు. అన్నట్లు ఎన్టీఆర్ ‘దానవీరశూరకర్ణ’లో అర్జునుడి పాత్రకు మొదట మాదాల రంగారావును అనుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, ఒక రోజు షూట్ తర్వాత వద్దనుకుని హరికృష్ణను తీసుకున్నారట. ఇతర హీరోలు, నటులతో పోలిస్తే మాదాల రంగారావు ప్రత్యేక తరహా నటుడు. చిత్ర పరిశ్రమలో తమదైన శైలిలో సినిమాలు తీస్తూ ముందుకు సాగిపోయారు. మారుతున్న పరిస్థితుల్లో కూడా నమ్ముకొన్న సిద్ధాంతాలను చివరి వరకూ విడవలేదు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్లినా.. సినీ వినీలాకాశంలో ఎర్ర సూరీడుగా చిరస్థాయిగా నిలిచిపోతారు.
1979లో నవతరం పిక్చర్స్ సంస్థను స్థాపించి తానే హీరోగా ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే టి.కృష్ణ, పోకూరి బాబూరావు ఆయనకు షూటింగ్ సమయంలో సాయపడ్డారు. అలా వీళ్ల చిత్ర జీవితానికి మాదాల పునాదులు వేశారు. ఆ తర్వాత ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘ప్రజాశక్తి’, ‘స్వరాజ్యం’, ‘జనం మనం’, ‘ఎర్రమట్టి’ చిత్రాలను నటిస్తూనే నిర్మించారు.
‘ప్రజాశక్తి’ ద్వారా కొమ్మినేని కృష్ణమూర్తిని దర్శకుడిగా పరిచయం చేశారు. తనసారధ్యంలో ‘మరో కురుక్షేత్రం’, ‘మహాప్రస్థానం’, ‘నవోదయం’, ‘వీరభద్రుడు’, ‘బలిపీఠంపై భారతనారి’, ‘తొలిపొద్దు’, ‘ఎర్రపావురాలు’ చిత్రాలు ఇతరులకు నిర్మించారు. ‘యువతరం కదిలింది’ చిత్రానికి 1980లో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణనంది పురస్కారాన్ని బహూకరించింది.
సెన్సార్ కోసం నిరాహారదీక్ష చేసిన తొలి నిర్మాత:
‘విప్లవశంఖం’ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తే మద్రాసులోని శాస్త్రిభవన్‌లో ఉన్న సెన్సార్ ఆఫీస్ ముందు నిరాహారదీక్ష చేశారు. అలా సెన్సార్ సర్టిఫికేట్ కోసం నిరాహారదీక్ష చేసిన తొలి నిర్మాత మాదాల కావడం విశేషం. ఆ సమయంలోనే ప్రముఖ తమిళ నటుడు ఎంజీఆర్, శివాజీ గణేశన్ మాదాల వద్దకు వచ్చి ఆయన్ను అభినందించారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్‌ఎఫ్‌డిసి ఛైర్మన్ ద్వారా నిరాహారదీక్ష విరమించుకోమని పరోక్షంగా ప్రయత్నించినా ఆయన పట్టువీడలేదు. దాంతో ఆ చిత్రం సెన్సార్ కాక తప్పలేదు. ఆయన నిర్మించిన ‘ప్రజాశక్తి’ చిత్రాన్ని కూడా సెన్సార్ బోర్డు నిరాకరిస్తే సుప్రీం కోర్టుకు వరకు వెళ్లారు. ఏడాదిన్నరపాటు సాగిన ఈ పోరాటంలో సర్వోన్నత న్యాయస్థానం ఆయన పక్షానే నిలిచింది. సెన్సార్ వారు చిన్న మార్పులు చేసి సర్టిఫికేట్‌ను ఇవ్వక తప్పలేదు.
‘జనం-మనం’ చిత్రాన్ని కూడా విడుదల చేయనివ్వకపోవడంతో ఎనిమిది నెలల పాటు ప్రముక కమ్యూనిస్ట్ నాయకులు నిరాహారదీక్ష చేసి సర్టిఫికేట్ వచ్చేలా చేశారు. మాదాల నిర్మించిన ‘ఎర్రమట్టి’ చిత్రానికి ఐదేళ్ల తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. చలన చిత్ర చరిత్రలో ఇన్నిసార్లు సెన్సారు వారితో పోరాడి గెలిచిన నిర్మాత మాదాల.




