నమ్మక ద్రోహులకు గుణపాఠం చెబుదాం
– రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి న్యాయం చేయలేదు
– ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారు
– మహానాడులో నందమూరి బాలకృష్ణ
విజయవాడ, మే28(జనం సాక్షి ) : నమ్మక ద్రోహం చేసినవాళ్ళకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నందమూరి బాలకృష్ణ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ఏటా మహానాడు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. భావితరాలకు గుర్తునీడేలా ఎన్టీఆర్ సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు. ఏ కొడుకూ ఇంతవరకు తన తండ్రి పాత్ర చేయలేదని.. అలా చేసే అదృష్టం తనకే దక్కిందని బాలకృష్ణ అన్నారు. సామాన్యుడికి పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు తెదేపాకు ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లోనూ సత్తా చాటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ తలుపులు మూసి, అశాస్త్రీయంగా ఆంధప్రదేశ్ను విడగొట్టారు. హావిూల సాధన కోసమే చంద్రబాబు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారన్నారు. దగ్గర్లోనే ఎన్నికలున్నాయి.. నమ్మకద్రోహులకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.