బెల్లంపల్లి, మే 12, (జనంసాక్షి )నర్సుల సేవలు వెలకట్టలేనివి అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సుల వృత్తి చాలా గొప్పదని, రోగుల పట్ల నర్సులు చూపే ప్రేమాప్యాయతలు అనిర్వచనీయం అన్నారు. రోగుల పట్ల రక్త సంబంధికులే కనికరం చూపలేని పరిస్థితులలో నర్సులు పరిచర్యలు చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ లాగా వృత్తిలో అంకితభావంతో విధులు నిర్వర్తించి మంచి పేరు సంపాదించుకోవాలన్నారు. కరోనా ఆపత్కాల సమయంలో ప్రాణాలకు తెగించి నర్సులు చేసిన సేవలు వెలకట్టలేమని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం నర్సులను శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా – శ్రీధర్, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, కౌన్సిలర్ గెల్లి రాయలింగు, కో అప్షన్ సభ్యుడు వెంకటేష్, నాయకులు గడ్డం భీమా గౌడ్, లక్ష్మణ్, రమేష్, సన్నీ యాదవ్, సుమంత్, ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ సత్యనారాయణ, డాక్టర్లు, నర్సులు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




