Wednesday, 4 November 2026

నష్టపరిహరం అందించి న్యాయం చేయాలే – ఆర్డీఓకు వినతిపత్రం అందించిన పుట్టపాక గ్రామస్తులు

 

 

 

జనంసాక్షి, మంథని : గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే నిర్మాణంలో బాగంగా పంట భూములు, ఇండ్లు కోల్పోతున్న వారికి మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహరం చెల్లించి న్యాయం చేయాలని మంథని ఆర్డీఓ వీరబ్రహ్మచారికి పుట్టపాక గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. భూసేకరణలో బాగంగా గురువారం పుట్టపాక గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ రొడ్డ మమత శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హజరైన ఆర్డీఓకు గ్రామస్తులు తమ సమస్యలు వివరించారు. గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే నిర్మాణంలో పుట్టపాక గ్రామంంలో పంట భూములు, ఇండ్లను కోల్పోతున్నామని తెలిపారు. మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిని అనుకున్న పంట భూములు ఎకరానికి రూ.50నుంచి 60లక్షల వరకు ధర పలుకుతున్నాయని, ఈ క్రమంలో మార్కెట్‌ ధర ప్రకారం భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహరం అందించాలన్నారు. అదేవిధంగా హైవే రోడ్డునిర్మాణంలో గ్రామంలో కొంతమేర నివాస గృహాలు, కట్టడాలు సైతం పోతున్నాయని, వాటికి సరైన విలువతో నష్టపరిహరంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేయాలని, ఫీల్డ్‌ సర్వేలో ఇప్పటికి వరకు నమోదు కాని ఇండ్లు, భూములు, బోర్లు, బావులు, చెట్లను నమోదు చేయాలని, గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోతున్న గ్రామస్తులకు సరైన నష్టపరిహరం అందించి న్యాయం చేయాలని ఆర్డీఓకు అందించిన వినతిపత్రంలో వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెగడ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ ఐలి శ్రీనివాస్‌, రామగిరి మండల పార్టీ అధ్యక్షుడు శంకేషి రవీందర్‌, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.