నాంపల్లి ఎగ్జిబిషన్ లో సింగరేణి సేవా ఉత్పత్తుల స్టాల్ ప్రారంభం…..
మహిళా స్వశక్తి బృందాలకు ఉత్పత్తి దారులకు సింగరేణి ప్రోత్సాహం
జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్…….
ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా హైదరాబాద్ నాంపల్లి లో నిర్వహిస్తున్న జాతీయ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో సింగరేణి ప్రాంత మహిళా స్వయం ఉపాధి యూనిట్ల వారు తయారు చేసిన వస్తువుల అమ్మకానికి సింగరేణి సంస్థ ఒక ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసింది. దీనిని బుధవారం సాయంత్రం సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షులు, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, సేవా అధ్యక్షురాలు ఆశా సురేశ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సేవా సమితి ద్వారా గత రెండు దశాబ్దాలుగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ లను సింగరేణి అందిస్తోందని, శిక్షణ పూర్తి చేసుకున్న వేలాది మంది యువతులు టైలరింగ్, పేపర్ బ్యాగ్‌ల తయారీ, ఎంబ్రాయిడరీ, గృహోపకరణాల తయారీ వంటి స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకొని వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. అటువంటి వారికి తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో అవకాశం కల్పిస్తూ గత 15 ఏళ్లుగా సింగరేణి ఆధ్వర్యంలో స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ ఏటా రూ.5 లక్ష ల నుంచి రూ.8 లక్షల వరకు ఈ స్టాల్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఈ స్టాల్ అద్దె ఖర్చులు, ఏర్పాట్ల వ్యయంతోపాటు సింగరేణి వ్యాప్తంగా ఇక్కడకు వచ్చి వస్తువులు విక్రయిస్తున్న వారికి ఉచిత భోజన వసతిని కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. ఇక్కడ వస్తువులు అమ్ముతున్న స్వయం ఉపాధి యూనిట్ల వారు ఇతరుల వస్తువులను, ఆధునిక రీతులను గమనిస్తూ వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు తమ ఉత్పత్తులు రూపొందించుకోవాలని సూచించారు.
సింగరేణి స్టాల్ లో అమ్మే వస్తువులు ఇతరులతో పోల్చితే నాణ్యత మరియు తక్కువ ధరకు లభించడంతో వినియోగదారులను ఆకర్షిస్తోందని, ఇక్కడ అమ్మే వస్తువులకు కూడా బ్రాండ్ ఇమేజ్ ఏర్పడటం సంతోషకరమన్నారు. ఈ స్టాల్ లో మందమర్రి, ఇల్లందు, శ్రీరాంపూర్, గోదావరిఖని, మణుగూరు తదితర ప్రాంతాలకు చెందిన స్వయం ఉపాధి యూనిట్ల మహిళలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, డిప్యూటీ మేనేజర్ ఐటీ షర్మిలా మొజెస్, అకౌంట్ ఆఫీసర్ వినూత్న, సీనియర్ పీవో శ్రీకాంత్, అడ్వైజర్ గణాశంకర్ పూజారి, సింగరేణి భవన్ ఉద్యోగులు కిశోర్, శ్రీమతి శారద, నాగమణి, జ్యోతిలక్ష్మి, ఎస్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
-జనం సాక్షి
నాంపల్లి ఎగ్జిబిషన్ లో సింగరేణి సేవా ఉత్పత్తుల స్టాల్ ప్రారంభం




