ఇటిక్యాల (జనంసాక్షి) మార్చి 28 : నానో యూరియాతో తక్కువ పెట్టుబడితో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి భారత సింహ అన్నారు. మంగళవారం చాగపురం గ్రామంలోని రైతు వేదికలో నానో యూరియా వాడకం పైన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడి వ్యయం పెరిగిపోతున్న వేళ, రైతాంగానికి త్వరలోనే మనదేశంలో నానో యూరియా అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వేప యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో (IFFCO) నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ ద్రవరూపంలో ఉండే నానో యూరియాను తయారు చేస్తుందన్నారు. ఇలాంటి యూరియా తయారీ ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం యూరియా పేరు చెప్పగానే ఎవరికైనా బస్తాల్లో ఉండే తెల్లటి గుళికలే గుర్తుకొస్తాయి వర్షానికి తడిస్తే ఇది కరిగిపోవడంతో 45 కిలోల బరువుండే యూరియా బస్తాను ఎరువుల దుకాణం నుంచి పొలం వరకు తీసుకెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం అన్నారు. కానీ ఈ నానో యూరియాతో అలాంటి ఇబ్బందులు లేకుండా 45 కిలోల యూరియాను అర లీటర్ బాటిల్లో పట్టేలా తయారు చేయడం జరిగిందన్నారు. 500 ఎంఎల్ నానో యూరియా (Nano Liquid Urea) బాటిల్లో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుందని, లిక్విడ్ యూరియాను నీటిలో కలిపి పిచికారీ చేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. ఈ యూరియాను పత్తి, మొక్కజొన్న తదితర 94 రకాల పంటల మీద పిచికారీ చేయొచ్చుని,
తక్కువ ధరకే అందుబాటులో ఉన్న సంప్రదాయ యూరియాతో పోలిస్తే.. నానో యూరియా తక్కువ ధరకు లభిస్తుందన్నారు. అంతే కాదు దీని వాడకం వల్ల పంటలలో దిగుబడి 8 శాతం పెరుగుతుందనన్నారు. సబ్సిడీలు పోనూ యూరియా బస్తా ధర రూ. 268 ఉండగా నానో యూరియా బాటిల్ ధర రూ. 240కే లభించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాముడు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
నానో యూరియాతో అధిక దిగుబడి




