Wednesday, 4 November 2026

నామమాత్రం ఫీజులతో ప్రజలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి

 

 

 

 

 

నాగారం సర్పంచ్ బూడిద మల్లేష్ జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం రైతువేదిక భవనంలో సర్పంచ్ బూడిద మల్లేష్ అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ.. పాత నాగారం గ్రామ కంఠాన్ని రద్దు పరచి ప్రస్తుతం ప్రజలు నివసిస్తున్న నాగారం గ్రామంలోని నివేశన స్థలాలు గ్రామకంఠం భూములుగా మార్చాలని, గ్రామం లోని నివేశన స్థలాలతో పాటు , ఇండ్లని వెంటనే రివిజన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రివిజన్ కాకపోవడం వలన గ్రామంలోని ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, నూతన గృహాలను నిర్మించలేక పోవుచున్నారని, బ్యాంకుల నుండి గృహ రుణాలను పొందలేక పోతున్నారని, తమ సొంత ఇంటిని అమ్మడం లేదా కొనుగోలు చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో జీవో నెంబర్ 58, 59 ప్రకారం లబ్ధిదారులకు జారీ చేసిన డిమాండ్ నోటీసులలో చెల్లించవలసిన మొత్తం విలువ, మార్కెట్ రేటుకు సమానంగా ఉందని పేద ప్రజలు అంత మొత్తాన్ని వెచ్చించలేరని కావున నామమాత్రం ఫీజులతో ప్రజలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత అక్టోబర్ నెలలో గ్రామపంచాయతీ ఐ.ఎఫ్.ఎమ్.ఎస్. లో జనరేట్ చేసిన చెక్కులు నేటికి పాస్ కాలేదని, గ్రామపంచాయతీ అవసరాల నిమిత్తం తెచ్చిన వస్తువుల తాలూకు డబ్బులు చెల్లించాలని దుకాణ దారులు ఒత్తిడి చేస్తున్నారని , పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్రామపంచాయతీ అత్యవసర సేవలు నిలిపివేస్తామని ప్రజలకి తెలుపుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇట్టి సమావేశంలో వార్డు సభ్యులు జైపాల్ మాట్లాడుతూ జీవో నెం.58, 59 ప్రకారం అర్హులైన లబ్దిదారులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, 30 ఏప్రిల్ చివరి తేదీ అని తెలిపారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ భాస్కర్ రెడ్డి , వార్డ్ సభ్యులు మద్దెల మల్లీశ్వరి, బూడిద జైపాల్, పంచాయతీ కార్యదర్శి అనిల్, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.