నాలుగేళ్లలో 5లక్షల కోట్లను..  బాబు విదేశాలకు తరలించారు


– ప్రజా సమస్యలకంటే.. స్వార్థప్రయోజనాలే బాబుకు ముఖ్యం
– 15అసెంబ్లీ సీట్లు ఇస్తే.. పశ్చిమ జిల్లాకేం చేశారు?
– రౌడీ యిజాన్ని, ఇసుకదందాను పెంచి పోషిస్తున్నారు
– విదేశాలకు పారిపోకుండా బాబు, లోకేశ్‌ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలి
– అధికారంలోకి రాగానే విదేశాలకు తరలించిన సొమ్మును వెనక్కు తెస్తాం
– విలేకరుల సమావేశంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి
ఏలూరు, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) :  రాష్ట్రంలో అవినీతిమయంగా తెదేపా పాలన సాగుతుందని, నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు రూ.5లక్షల కోట్లును విదేశాలకు తరలించారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు విదేశాలలో దాచుకున్న అక్రమార్జనను వెనక్కి రప్పిస్తామని అన్నారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన అంతా అవినీతి మయంగా తయారైందన్నారు. ప్రధానంగా పశ్చిమలో 15 అసెంబ్లీ సీట్లను ప్రజలు ఇస్తే.. అసలు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని సీట్లు ఇస్తే రౌడీ ఇజాన్ని, ఇసుకదందాని టీడీపీ ఎమ్మెల్యేలతో చేయిస్తున్నారన్నారు. ద్వారకాతిరుమల వెంకన్నసాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేసి పశ్చిమకు ఎంత న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొల్లేరు విషయంలో స్వార్థ ప్రయోజనాలే తప్ప ప్రజల కోసం మాత్రం ఏవిూ చేయలేకపోయారని విమర్శించారు.
2014లో డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సన్మానం చేయించుకున్నారని, కానీ వారికి రుణమాఫి మాత్రం చేయలేకపోయారని విమర్శించారు.  ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన తనయుడు విదేశాలకు
పారిపోకుండా వారి పాస్‌ పోర్ట్‌ లు సీజ్‌ చెయ్యాలని విజయసాయి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్‌ అని, తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ కలయిక అనైతికం అన్నారు. ఐటి సోదాలంటే చంద్రబాబు భయపడుతున్నారని, తప్పు చేయకపోతే ఐటి సోదాల సమయంలో పోలిసులను పంపకూడదని క్యాబినెట్‌లో ఎందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. నాలుగున్నరేళ్ళు కేంద్రంతో జతకట్టి ఇపుడు సహకరించడంలేదంటూ చంద్రబాబు లేఖ రాస్తాననడం హస్యాస్పదం’ అని విజయసాయి రెడ్డి విమర్శించారు. ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారన్నారన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని అధికారంలోకి రాగానే సుపరిపాలనే అందించాలనేది తమ పార్టీ ఉద్దేశమన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు.

తాజావార్తలు