.
– సంఖ్యాబలం ఉన్నోళ్లు తనను లేపేస్తమన్నరు
– ఆంధ్రా, తెలంగాణ పోరాట తరహాలో లారీ అసోసియేషన్ పోరాటం
– స్వప్రయోజనాల కోసం ఏనాడు ఆశపడలేదు
– జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనం సాక్షి, మంథని : సంఖ్యాబలంతో తనకు అవసరంలేదని, సంఖ్య తక్కువగా ఉన్నా న్యాయం వైపే తన మొదటి అడుగుపడుతుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిద్దపల్లి గ్రామంలో మంథని, ముత్తారం, రామగిరి మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయం, లారీ యార్డ్‌ను ఆదివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. సంఖ్య తక్కువ ఉండి న్యాయం ఉన్న వారిపై తాము ఉంటామన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి మంథని మట్టిని ముద్దాడిన బిడ్డగా న్యాయం ఉన్న వారి వైపే ఉంటున్నామని ఆయన గుర్తు చేశారు. ఆనాడు సంఖ్యాబలం ఉన్నోళ్లు రాజీవ్ రహదారిపై కూర్చుండి తనను లేపేస్తామన్నారని, అయితే తాను సంఖ్యా బలానికి భయపడలేదన్నారు. ఈనాడు లారీ అసోసియేషన్ కోసం జరిగిన పోరాటం ఆంధ్రా, తెలంగాణ పోరాటం గుర్తుకు వచ్చిందని, ఆనాడు ఆంధ్రాల్లో ఆంధ్రావాళ్లు తెలంగాణ రాదని ఎలా ఉద్యమం చేశారో, ఇక్కడ తెలంగాణ కోసం తక్కువ సంఖ్య ఉన్న మనం ఉద్యమం చేశామని, అయితే న్యాయం మనవైపు ఉండటంతో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని, అదే విదంగా తక్కువ లారీలు ఉన్నా న్యాయం మనవైపే ఉందని, ఆకలి మనకే ఉందని గట్టిగా పట్టుబట్టి అసోసియేషన్‌ను సాధించుకున్నామని ఆయన వివరించారు. ప్రజల ఓట్లతోనే నాయకులం అవుతామని గట్టిగా నమ్మే వ్యక్తిగా ప్రజలకు న్యాయం చేయాలని ప్రతిక్షణం ఆలోచన చేస్తామన్నారు. 40 ఏండ్ల క్రితం నుంచే ఈ ప్రాంతంలో సింగరేణి మైన్స్ ఉన్నా కనీసం ఉపాధి అవకాశాలు కల్పించి మన ఆకలి తీర్చాలని గత పాలకులు ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు. ఆనాడు అక్కెపల్లి ప్రాంతంలో సింగరేణి ఓసీపీల్లో అనేక కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత యువకులకు ఉపాధి మార్గాలు చూపించని చరిత్ర కాంగ్రెస్ పాలకులదన్నారు. ఆనాడు ఆయా కంపెనీల్లో ఈ ప్రాంత యువకులకు ప్రాధాన్యత ఇచ్చే వారు కాదని, పది ఇరువై మందికి ఉపాధి చూపించి చేతులు దులుపుకునే వారన్నారు. కానీ తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వందల సంఖ్యలో యువకులకు ఉపాధి ఆవకాశాలు కల్పించామన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో ఆలోచన చేశామని, ఆనాడు మంత్రి కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే ఆయన సర్థిచెప్పి యువత ఆకలి తీర్చేలా ప్రయత్నం చేశామన్నారు. లారీ ట్రాన్స్‌ఫోర్ట్ విషయంలో, ఎన్సీసీ కంపెనీలో ఉద్యోగాలు, ఇతర సమస్యల విషయంలో ప్రజా నాయకుడిగా ఎన్నోఆలోచనలు చేస్తున్నామని, తమ పోరాటంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు గురించి ఆలోచిస్తలేమన్నారు. ప్రబావిత గ్రామాల నిర్వాసితుల గురించి గత పాలకులు ఆలోచన చేసి ఉంటే ఈనాడు ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. పేదోడి ఆకలి తీర్చాలని తాము ఆలోచన చేస్తుంటే తమకు ఆశచూపే ప్రయత్నాలు చేస్తుంటారని, కానీ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ప్రతి పేదోడి గురించే నిస్వార్థంగా ఆలోచన చేస్తుంటామని, ప్రభావిత గ్రామాల నిర్వాసితుల పరిహరం విషయంలో ఆశచూపే ప్రయత్నం చేశారని, రూ.30, 40 లక్షలు ఇస్తామని ఆశ చూపారని, రూ.3 కోట్లు ఇస్తామన్నా ఈ మట్టి బిడ్డగా తాను తీసుకోనని చెప్పి నిస్వార్థంగా పరిహారం ఇప్పించామన్నారు. నిర్వాసితులకు రావాల్సిన ప్రతి పైసా కోసం తమ పోరాటం ఉంటుందని, ఆలోచన ఉంటుందని, ప్రజల కోసమే తప్ప తమ కుటుంబం కోసం ఎలాంటి ఆలోచన చేయన్నారు. చిన్న కులంలో పుట్టిన మూలంగానే తనకు అవమానాలు చోటు చేసుకుంటున్నాయని, పెద్ద కులంలో పుట్టి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉంటే ఎంతో గౌరవం ఇచ్చే వారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాజంపై ప్రేమ లేనోళ్లను సార్ అంటూ గౌరవిస్తున్నారని, ఏం పనిచేయకుండానే అధికారంలో ఉంటున్నారని అన్నారు. చిన్న కులంలో పుట్టినా ఎవరి ముందూ తల దించుకునే పరిస్థితుల్లో తాము లేమన్నారు. ప్రజలకు సేవ చేయడంలో, అభివృద్ది విషయంలో వెనుకడుగు వేయడంలేదని, ప్రతి క్షణం పేదవారి ఆకలి తీర్చాలని ఆలోచన చేస్తున్నామన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక సేవలు చేస్తుంటే ఈ ప్రాంతంలో ప్రజల ఓట్లతో గెలిచి అనేక పదవులు అనుభవిస్తూ కనీసం రూపాయి ఖర్చు లేని సేవలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పేదవారి ఆకలి తీర్చాలని అన్నం పెడుతుంటే దాన్ని విమర్శిస్తున్నారే కానీ అలాంటి సేవలు చేస్తూ మన ఆకలి తీర్చాలని చూడటం లేదన్నారు. తమ ఆలోచన, తమ ఆకాంక్ష పేదోడి ఆకలి తీర్చాలని, వారంతా గౌరవంగా బతుకాలని ఆలోచన చేస్తున్నామని, ప్రతి విషయంపై చర్చ జరుగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో లారీ అసోసియేషన్ ఆర్థికంగా ఎదుగాలని, ఎలాంటి వర్గవిభేదాలు లేకుండా ఐక్యంగా ఉండాలని ఆయన హితవు పలికారు. అనంతరం జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు గజమాలతో సన్మానించారు.
నా మొదటి అడుగు న్యాయం వైపే వేస్తా.




