నిజం చెప్తున్నా.. ఆ లేఖ నేను రాయలేదు..
– భాజపా అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్,నవంబరు 20(జనంసాక్షి): గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వరదసాయం నిలిపివేయాలంటూ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని తెరాస ఆరోపించింది. చిత్తశుద్ధి ఉంటే తాను లేఖ రాసినట్టు నిరూపించాలని తెరాసకు బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను లేఖ రాయలేదని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేస్తానని, సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని బండి సంజయ్ నిన్న ప్రకటించారు. ముందుగా ప్రకటించిన విధంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం రాక కోసం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి చూశారు. బండి సంజయ్‌తో పాటు భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ విూడియాతో మాట్లాడుతూ…వరద సాయం ఆపాలని ఎస్‌ఈసీకి భాజపా లేఖరాసిందని సీఎం కేసీఆర్ చెప్పడం బాధ కలిగించిందన్నారు. ”భాజపా లెటర్ హెడ్, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు. గతంలో అనేక సార్లు సీఎంకు, ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాశా. కానీ, ఈ సంతకం నాది కాదు. ఎన్నికల జిమ్మిక్కిల్లో భాగంగా నకిలీ లేఖలు సృష్టించారు. సీఎం కేసీఆర్ భాజపాపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నా. వరద సాయం అందక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తు?న్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వరద బాధితులందరికీ సాయం అందించాకే ఎన్నికలకు వెళ్లాల్సింది. సర్వేలన్నీ భాజపాకు అనుకూలంగా ఉన్నాయనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. భాగ్యనగరం మేయర్ పీఠాన్ని భాజపాకు కట్టబెట్టాలని కోరుతున్నా. వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.25వేల చొప్పున వరద సాయం అందిస్తాం. మేము ఇచ్చిన హావిూలను తప్పకుండా అమలు చేసి చూపెడతాం. తెరాస ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను ఎన్ని నెరవేర్చారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు…ఎక్కడ చేశారు. ఎన్నికలు వస్తాయి పోతాయి ..కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు. మజ్లీస్‌తో కుమ్మక్కై కేసీఆర్ భాజపా విూద ఆరోపణలు చేస్తున్నారు. అబద్ధాల ముఖ్యమంత్రిని ప్రజలు నమ్మొద్దు. భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత భాజపాదే” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.