బెల్లంపల్లి, జులై 1, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని నిత్య పిల్లల ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంసిపిఐ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ తాండూరు ఐ.బి కొత్త గుడిసెల నివాసులైన జాడి కిషన్, కళావతి దంపతుల 3 నెలల పసికందును బెల్లంపల్లి క్రిష్ణమందిర్ లైన్లో ఉన్న నిత్య పిల్లల హాస్పటల్ కు సాధారణ వైద్య పరీక్షల కోసం తీసుకొస్తే ఊపిరితిత్తుల్లో నంజు ఉందని డాక్టర్ ముగ్దూరి శ్రీకాంత్ రెడ్డి ఆయన సరైన అర్హతలేని సిబ్బంది నిర్లక్ష్యంగా నోట్లో పైపు వేసి నంజు తొలగించే క్రమంలో ఊపిరి ఆడకపోవడంతో పరిస్థితి విషమించిందని హుటాహుటిన ప్రైవేట్ అంబులెన్స్ లో మంచిర్యాలకు పంపించినారని, మంచిర్యాల్ డాక్టర్లు కరీంనగర్ కి వెళ్ళమని చెప్పగా కరీంనగర్ డాక్టర్ బాబు ఐదు గంటల ముందే చనిపోయాడని తెలపడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయని, చనిపోయిన శిశువుని తమ చేతికి అందించి ఐదు గంటల పాటు తల్లిదండ్రులకు నరకయాతన చూపించి తన పొరపాటు లేదని చేతులు దులుపుకుందామనుకున్న డాక్టర్ మరియు ఆసుపత్రి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3నెలల పసికందు మృతదేహంతో తల్లిదండ్రులు బెల్లంపల్లి పట్టణంలోని నిత్యా పిల్లల హస్పటల్ ముందు ఆందోళన చేపట్టారని, ఇది ముందే గమనించిన నిత్య హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ మరియు సిబ్బంది హాస్పటల్ షెటర్లకు తాళాలు వేసి అక్కడుండి పారిపోవడం జరిగిందన్నారు. వెంటనే హస్పటల్ యాజమాన్యం, డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతిలేని ప్రైవేట్ ఆస్పత్రిలను వెంటనే మూసివేయాలని, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం, మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. లేనట్లయితే ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) జిల్లా నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, పసులేటి వెంకటేష్, ఆరెపల్లి రమేష్, బర్ల స్రవంతి, కాంపల్లి రాధ, రాజన్న ఆకాష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు
నిత్య పిల్లల ఆసుపత్రిని వెంటనే మూసివేసి డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.




