ప్రచారంలో వెనకబడ్డా విజయ లక్ష్యంలో ముందే ఉన్నాం
కూటమిగా ప్రచారం చేసేందుకే విడిగా ప్రచారం చేయడం లేదు
వెనకడుగు వేయడం లేదన్న కోదండరామ్
టిఆర్‌ఎస్ నేతల భాషపై మండిపడ్డ రమణ
సీట్ల తకరారుపై మరోమారు కూటమి నేతల భేటీ
తాజా పరిస్థితులపై చర్చించిన కోదండరామ్, రమణ, చాడ
హైదరాబాద్,అక్టోబర్31(జనంసాక్షి): తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే మహాకూటమి ఏర్పాటైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పునరుద్ఘాటించారు. తమ కూటమి లక్ష్యం చేరుకునేలా తామంతా కృషి చేస్తున్నామని, ఇందులో వెనకడుగ వేసే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాట్లపై మహాకూటమి నేతలు మరోమారు బుధవారం నాడిక్కడ సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలతో పాటు ఎల్.రమణ, కోదండరామ్, చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోదండరామ్ విూడియాతో మాట్లాడుతూ.. పొత్తులకు సంబంధించి ఒక స్పష్టతకు రావాలనే సమావేశం అయ్యామని తెలిపారు. నిరంకుశ పాలన అంతం చేయడానికి కూటమిగా ఏర్పడ్డామని వివరించారు. తాము కూడా విడిగా ప్రచారం చేయలేక కూటమిగా ప్రచారం చేయాలనుకున్నామని తెలిపారు. కూటమి ఏర్పాటు కృషి బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని, దాని విూద త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
మహాకూటమి ఏర్పాటుతో రాష్ట్రంలో మార్పు వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఈ కూటమి ఏర్పాటులో అన్ని పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. కూటమి ఏర్పాటు ఆలస్యం కావడంతో పార్టీల కేడర్‌తో పాటు ప్రజల్లోనూ గందరగోళం నెలకొన్నదన్నారు. అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతో తెరాసకు ధీటుగా ప్రచారం చేయలేకపోతున్నామన్నది వాస్తవేమని కోదండరామ్ అంగీకరించారు. అయినంత మాత్రాన ప్రచారం ఆగదని అన్నారు. కేసీఆర్ దుష్టపాలనకు వ్యతిరేకంగానే కూటమి ఏర్పాటు చేశామన్నారు. తాము మహాకూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై తాము ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదని కోదండరామ్ పేర్కొన్నారు. ఎల్.రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో టీఆర్‌ఎస్ నేతలను నిలదీస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. తాము కన్నెర్ర చేస్తే కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే రాజకీయ గుత్తాధిపత్యంతో పాలించిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రూ.వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. నేరేళ్ల బాధితులతో కేటీఆర్ ప్రమేయం లేదని బలవంతంగా చెప్పించారని అన్నారు. మహా కూటమి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని, ఇది దేశం మొత్తం ఏర్పడబోతోందని వెల్లడించారు. తమ నేతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపైనే ఉందని రమణ పేర్కొన్నారు. కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ విపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డామన్నారు. త్వరలో ప్రజల ముందుకు మేనిఫెస్టోను తీసుకువస్తామని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మహాకూటమి మరింత బలోపేతం చేయాలని గుర్తించామని, ఆ బాధ్యత
మాపై ఉందని వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విచ్చలవిడిగా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. మా కూటమి ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తుందని చెప్పారు. మేనిఫెస్టోను ప్రజా మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఇదిలావుంటే ఒక వైపు టీఆర్‌ఎస్,అభ్యర్థులను ముందే ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతూ ఉంటే..మరో వైపు మహా కూటమిలో సీట్ల వ్యవహారం తేలక అభ్యర్థులు ప్రచారంలో వెనకబడిపోతున్నారు. నిజానికి మహా కూటమిలో కాంగ్రెస్‌దే పెద్దన్న పాత్ర. తెలంగాణ జన సమితి(టీజేఎస్), సీపీఐ, టీడీపీ నేతలు కాంగ్రెస్ అగ్రనేతల వెంట పడుతూ సీట్ల వ్యవహారం తొందరగా తేల్చాలని వేడుకుంటున్నారు. ఎన్ని సీట్లు తమకు కేటాయిస్తారో, తమకు బలంగా ఉన్న నియోజకవర్గాలను కేటాయిస్తారో లేదో అన్న అనుమానం భాగస్వామ్య పక్షాల నేతల్లో తలెత్తుతోంది. దీనిపై తాజాగా మహాకూటమిలోని టీజేఎస్, సీపీఐ, టీడీపీ పార్టీలు చర్చించాయి.




