Monday, 2 November 2026

ఏపీకి న్యాయం చేయమన్నందుకే..  కేంద్రం ఐటీదాడులు

– ఎంపీ కొనకళ్ల నారాయణ
తిరుమల, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : రాష్ట్రానికి న్యాయం చేయమని కేంద్రంపై పోరాటం చేస్తున్నందుకే ఐటీ, సీబీఐతో దాడులు చేయించి తెదేపా నాయకులను ఇబ్బందులు పెడుతున్నారని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. బుధవారం తిరుమలశ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రధాని అభ్యర్థిగా పోటీకి వస్తారనే భయంతోనే రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. భాజపాయేతర పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి వైకాపా, జనసేన పార్ఠీలు కొమ్ముకాస్తున్నాయని ఎంపీ ఆరోపించారు. విడిపోయి నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అండగా ఉంటారనే తాము బీజేపీతో కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగామని అన్నారు. కానీ నాలుగేళ్లు కేంద్రంలో కలిసి ఉన్నా కేంద్రం ఏపీకి ఎలాంటి సాయం చేయలేదని, చంద్రబాబు 29సార్లు ఢిల్లీ తిరిగి మోదీకి వినతులు ఇచ్చినా కేంద్రం న్యాయం చేసేందుకు ముందుకు రాలేదని అన్నారు. దీంతోనే తాము కేంద్ర ప్రభుత్వం
నుండి బయటకు రావాల్సి వచ్చిందని, అప్పటి నుండి ఏపీ ప్రభుత్వంకు చెందిన ఎంపీలు, ఇతర నేతలు, పారిశ్రామఇక వేత్తలపై ఐటీ, సీబీఐ దాడులకు దిగుతుందని విమర్శించారు. తద్వారా రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకొని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిని ఎదుర్కొని తన సొంత ఇమేజ్‌తో రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో కేంద్రంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఏపీ సత్తా, తెలుగు ప్రజల సత్తా ఎలా ఉంటుందో మోదీకి రుచిచూపిస్తామని కొనకళ్ల పేర్కొన్నారు.