రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 24. (జనంసాక్షి). సిరిసిల్లలో ఈనెల 26న జరిగే నిర్బంధ వ్యతిరేక బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క పిలుపునిచ్చారు. సోమవారం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన సమావేశంలో విమలక్క మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీడీ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసిన క్రమంలో కార్మిక నాయకులపై కుట్ర కేసులు పెట్టడాన్ని తప్పు పట్టారు. అప్రకటితంగా కొనసాగుతున్న నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. యువతను మత్తులో ముంచుతున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టారు ఊరు రా బెల్ట్ షాపులు యువతను నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మనాయక కళ్యాణ మండపంలో ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో కూర రాజన్న తో పాటు జే.వి .చలపతిరావు, గుర్రం విజయ్ కుమార్ ప్రజాసంఘాల నాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రజాసంఘాలు ఉమ్మడి వేదిక నాయకులు సంతోష్ ,రాజేశ్వరి, వెంకటేష్ ,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.




