బెల్లంపల్లి ఏప్రిల్ 7, (జనంసాక్షి )బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు పూర్తిగా అసత్యమని, ఆరిజిన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ, శైలజ చేసినటువంటి మోసాలపై ఆధారాలతో సహా బహిర్గతం చేశానని తెలిపారు. అసలు ఆ సంస్థ అనేదే లేదని, కేవలం ప్రజలను మోసం చెయ్యడానికే ఒక డైరీ అనే పేరుతో అతను ఇదంతా చేశారని తెలిపారు. అతి తక్కువ సమయం లోనే ఎక్కువ డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని, తక్కువ సమయం లోనే పసిగట్టి ఆదినారాయణ, అతని టీమ్ ను పోలీసులకు అప్పగించానని అందువల్లనే వాళ్లు నాపై కక్ష సాధించుకోవాలని ఇదంతా చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో తాను మళ్లీ బీఆరెస్ పార్టీ నుండి మూడవసారి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలుస్తాననే ఉద్దేశంతో తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది ధనవంతులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేనైనా తనను ఆబాసుపాలు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని పేపర్ లీక్ ల వెనుక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని, పేపర్లు లీక్ చేసి విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైన బురదజల్లే ప్రయత్నాలు మానుకోకపోతే ప్రజల చేతుల్లో బిజెపికి బుద్ధి తప్పదని హెచ్చరించారు. వెంటనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక శాశ్వత ఇండ్లపట్టాల మంజూరును కూడా వేగవంతం చేయడమే కాకుండా దరఖాస్తు తేదీని కూడా మరోసారి పొడిగించడం జరిగిందని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో కూడా ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, బెల్లంపల్లి ప్రజలెవరూ ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను అప్పనంగా ప్రయివేటు సంస్థలకు దారాదాత్తం చేసేందుకు కుట్రలు పన్నుతుందని, అందులో భాగంగానే సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేస్తుందని, సింగరేణి ప్రజానీకం తిరగబడి బొగ్గు బ్లాకుల వేలం ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే మహా నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్రం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బీఆరెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




