నువ్వా…! నేనా..! అన్నట్టు గా మునుగోడు సంబరాలు.

– చండ్రుగొండ లో రోడ్డెక్కిన టీఆర్ఎస్ విజయోత్సవం

– ఒక వర్గం బస్టాండ్ సెంటర్

– మరో వర్గం ప్రధాన సెంటర్

– ఆసక్తిగా తిలకించిన గ్రామస్థులు

చండ్రుగొండ జనంసాక్షి (నవంబర్ 07) : పార్టీ ఒక్కటే…సందర్భము ఒక్కటే.. అభిమానించే నాయకుడు ఒక్కడే…కానీ మేము మాత్రం వేరు వేరు అని రోడ్డెక్కి రుజువు చేశారు చండ్రుగొండ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సంబరాలను ఆదివారం పార్టీ మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సంబరాలు నిర్వహించాల్సిందిగా టీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించడంతో ఎక్కడికి చేరాల్సిన నాయకులు అక్కడికి చేరుకున్నారు. పోటాపోటీగా సంబరాలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక వర్గం బ్యాండ్ మేళం తో బస్టాండ్ సెంటర్లో సంబరాలు చేస్తే, మరో వర్గం ప్రధాన సెంటర్లో బాంబుల మోత మోగించి విజయోత్సవాన్ని జరిపింది. వేర్వేరుగా నిర్వహించిన సంబరాలను ఆసక్తిగా గమనించిన గ్రామస్థులు కాసేపు ఉత్సాహంగా గడిపారు. ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మెప్పు కోసమే అంటూ చెప్పుకున్నారు. ఏదేమైనా టీఆర్ఎస్ నాయకుల తీరు మారకుంటే నియోజకవర్గంలో పార్టీ నీరసించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఓ వర్గం ప్రధాన సెంటర్లో విజయోత్సవ పండుగ చేద్దామని పిలిచినా మరో వర్గం పెడచెవిన పెట్టినట్టు సమాచారం.