నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కేంద్రంలో రూ.52 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.కలెక్టరేట్ ప్రాంగణమంతా కలియ తిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు.వివిధ విభాగాల కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను పరిశీలించారు.నిర్మాణాలకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకే గొడుగు కిందకు జిల్లాలోని అన్ని కార్యాలయాలతో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తున్నారని అన్నారు.సమీకృత భవనంలో 28 విభాగాల కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.ప్రతి కలెక్టరేట్లో మంత్రుల కోసం స్టేట్ చాంబర్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సమీక్షలు నిర్వహించుకునే ఏర్పాట్లు చేయాలని సూచించారని అన్నారు.ప్రజల మేలు కోసం ఇంతటి గొప్ప ఆలోచన సీఎం కేసీఆర్ మాత్రమే చేశారన్నారు.ప్రస్తుతం కలెక్టరేట్ నిర్మాణం పూర్తి కావస్తుండగా భవన ఆధునీకరణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనం ఉట్టిపడేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.




