సమన్వయ సమితి సభ్యుల సహకారంతో పూర్తి
ఆగస్ట్ 15న లాంఛనంగా పథకం ప్రారంభం: గుత్తా
హైదరాబాద్,జూన్23(జనం సాక్షి): రైతుబీమా పథకానికి సంబంధించిన వివరాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా సాగుతోందని,ఈ నెలాఖరుకు దీనిని పూర్తి చేస్తామని రైతుసమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో గొప్ప పథకం రైతు బీమా పథకమని, రైతు మృతి చెందితే కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల అందించే రైతు బీమా పథకం గొప్పదని కొనియాడారు. దీనికి సంబంధించి సమన్వయ సమితి సభ్యులు అధికారులకు తోడుగా వెల్లి సమాచార సేకరణలో నిమగ్నమై ఉన్నారని అన్నారు. అసంఘటిత శక్తిని సంఘటితం చేసేదే రైతు సమన్వయ సమితుల పథకమని మెచ్చుకున్నారు. 1.6 లక్షల మంది సభ్యులను రైతు సమన్వయ సమితుల్లో నియమించామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారని, రైతు బీమా పథకంలో అధికంగా లబ్దిపొందుతున్నది చిన్న, సన్నకారు రైతులేనని పొగిడారు. వచ్చే ఏడాది నుంచి కోటి ఎకరాలకు నీరందించే పథకం అమలు చేస్తామని శనివారం ఆయన విూడియాతో మాట్లాడారు. ఎకరానికి ఏడాదికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి రాయితీ అందిస్తున్నామని, పెట్టిబడి రాయితీ పథకంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. రైతుకు పెట్టుబడి రాయితీ పథకాన్ని అందరూ ప్రశంసిస్తున్నారన్నారు. పెట్టుబడి రాయితీ పథకం ద్వారా 1.50 కోట్లమంది రైతులు లబ్ది పొందుతున్నారని కొనియాడారు. దేశంలోనే గొప్ప పథకం పెట్టుబడి రాయితీ పథకమని ప్రశంసించారు. రైతు బీమా పథకం కింద ఆగస్ట్ 15 నుంచి ప్రతి రైతుకూ రూ. 5 లక్షల జీవిత బీమా ఉచితంగా అందజేయనుందని ఎంపీ గుత్తా వివరించారు. ఈ నెల 30 వరకు రైతుల నామినీ వివరాల సేకరణ పూర్తి చేసి.. జూలై 15 వరకు డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, ఆగస్టు 15 నుంచి బీమా పత్రాల పంపిణీ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ పక్రియ మొత్తం పూర్తి కావడానికి రైతులు ముందుకు రావాలని కోరారు. రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి పూర్తి చేయాలని చెప్పారు. మద్దతు ధర విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వమూ సేకరించన రీతిలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసిందని చెప్పారు. గుంట భూమి ఉన్న రైతుకు కూడా ప్రభుత్వం ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుందని.. ప్రతి రైతూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నామినీ వివరాలను సకాలంలో వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఉచితంగా రూ. 5 లక్షల జీవిత బీమా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1100 కోట్ల భారం ఏటా మోసేందుకు సిద్ధమైందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకొని నామినీ పత్రాలు అందజేయాలని అన్నారు. అసంఘటితంగా ఉన్న రైతులందరినీ ఏకం చేస్తూ సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారని 1.6 లక్షల మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ పక్రియ పవిత్రమైన కలయిక అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తాను, మంత్రి పోచారంతో కలిసి ఇటీవల రోజూ రెండు జిల్లాలు పర్యటించి చైతన్య పరిచామని అన్నారు.




