Wednesday, 4 November 2026

నేడు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ…

double-bedroom-_0హైదరాబాద్ : హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో నూతనంగా నిర్మించిన 396 డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీకి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సందర్భంగా లబ్ధి దారులకు ఆయన స్వయంగా పత్రాలు పంపిణీ చేస్తారు. మంత్రి తలసాని విజ్ఞప్తిమేరకు గత ఏడాది జూన్‌లో ఐడీహెచ్ కాలనీని సందర్శించిన ముఖ్యమంత్రి ఆ కాలనీ దుస్థితికి చలించి కాలనీ వాసులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతిపాదిత డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ఇక్కడ పైలట్ ప్రాజెక్టుకింద చేపట్టారు. సుమారు 580 చదరపు అడుగుల వైశాల్యంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల ఖర్చుతో నిర్మించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా 260 చదరపు అడుగుల వైశాల్యంలో రూ. లక్ష నుంచి రెండున్నర లక్షల వ్యయంతో పేదలకు ఇండ్లు నిర్మించగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ-ఎస్టీ ఉప ప్రణాళిక కింద తొమ్మిదిన్నర లక్షల ఖర్చుతో 580 చదరపు అడుగుల వైశాల్యంలో ఇండ్లు నిర్మించడం విశేషం. 

ఇండ్లతోపాటు సువిశాలమైన రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, ప్రత్యేక ట్రాన్స్‌ఫారం, మంచినీటి కనెక్షన్లు వంటి ఏర్పాట్లన్నీ చేశారు. నిర్మాణంలో ఉన్నపుడే ఈ కాలనీని దేశంలోని అనేకమంది ప్రముఖులు సందర్శించి ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *