Monday, 2 November 2026

నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయి

మిర్యాలగూడ/భూత్పూర్‌:తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు, రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.మిర్యాలగూడ/భూత్పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఇచ్చేది చాలా తక్కువని, దానికంటే మెరుగ్గా ఆరోగ్యశ్రీ ఉన్నందునే తాను తిరస్కరించానని చెప్పారు. ఈ రెండింటిలో ఏది గొప్పదో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మోదీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని సూచించారు మహబూబ్‌నగర్‌ జిల్లా  రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్నే కాపీ కొట్టి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం తీసుకొచ్చారని విమర్శించారు. .. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే కేంద్రంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీల పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. . రైతులు, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, బీసీలకు ఏమైనా చేశారా? అని మోదీని నిలదీశారు. కాంగ్రెస్‌లేని భారత్‌ అని భాజపా.. మోదీని గద్దె దించుతామని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. గాంధీలు ఓ వైపు.. చౌకీదార్‌లు మరోవైపు తమ ప్రచారాలతో దేశంలో మైకులు పగులుతున్నాయి తప్ప ప్రజలకు మాత్రం ఏమీ ఒరగడంలేదని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

ఎన్డీయేకు 150.. కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు

‘‘దేశాన్ని సుమారు 72 ఏళ్లు పాలించిన ఈ రెండు పార్టీలు బీసీ మంత్రిత్వశాఖ పెట్టలేదు. ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నా. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. దేశం కొత్తబాట పట్టాలి. ప్రజల బాధలు ఈ రెండు పార్టీలతో తీరవు. ఎన్నికల తర్వాత తెరాస భరతం పడతామని భాజపా పగటికలలు కంటోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 150, కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, వ్యక్తులు కాదు.. ప్రజల అభిమతం.. అదే విజయం సాధించాలి. ప్రజలు ఎవరిని గెలిపించాలని కోరుకుంటారో వాళ్లే గెలవాలి. ఆర్థిక ప్రగతిలో నంబర్‌ 1, కరెంటు సరఫరాలో నంబర్‌ 1, సోలార్‌ విద్యుదుత్పత్తిలో 2 స్థానం.. ఇలా తెలంగాణ అద్భుతంగా ప్రగతి మార్గంలో వెళుతోంది. ప్రజా సంక్షేమబాట పట్టింది. దాన్ని చూసే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో బందీలుగా ఉన్నాం.. ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నాం. రైతులకు నీళ్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటా. చివరి ఎకరానికి కూడా నీళ్లు ఇస్తాం. లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తా. జిల్లాలో 3, 4 రోజులు ఉండి సమస్యలు పరిష్కరిస్తా. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు, కాలువల సమస్యలు పరిష్కరిస్తా’’ అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

అప్పుడు 11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయి

‘‘యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్‌ దాడులు 11 సార్లు జరిగాయి. బయటకు చెప్పరు. అవి వ్యూహాత్మక దాడులు. వాళ్లు చేస్తారు. మనం చేస్తాం. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్‌ స్ట్రైక్‌ అంటే 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని డొల్ల ప్రచారం చేశారు. చీమ కూడా చావలేదని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ చెప్పాడు. ఈ ప్రచారాలతో మీరు ఓట్లు అడుగుతారా? ఇదేనా దేశాన్ని నడిపించే తీరు’’ అని మోదీని ప్రశ్నించారు. దేశం బాగు పడేందుకు జాతీయ పార్టీ పెడతాం. ప్రజా ఆశీస్సులతో దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తాం. భూ పట్టాలకు ఎవరూ లంచాలు ఇవ్వొద్దు. నెలన్నర రోజుల్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటా’’ అని కేసీఆర్‌ అన్నారు.