నేను పాలమూరు సొంతబిడ్డను దత్తపుత్రులు మనకెందుకు


` మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు
` 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు
` పాలమూరు జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
` రైతుల కోసం ఇప్పటి వరకు రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రజాప్రభుత్వం
` నాడు.. వరి వేస్తే ఉరే అని కేసీఆర్‌ అంటే..
` నేడు మేము వరివేస్తే బోనస్‌ ఇచ్చామని సగర్వంగా చెప్పుకుంటున్నాం
` సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు మార్పు కోసం ప్రజాప్రభుత్వానికి పట్టంకట్టారు
` ఇచ్చి మాట నిలబెట్టుకుని హామీలు అమలు చేస్తున్న ప్రభుత్వం మాది
` మహబూబ్‌నగర్‌లో ‘రైతు పండుగ’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
` గత ప్రభుత్వం మూలన పడేసిన ప్రాజెక్టులను క్రమంగా పూర్తి చేస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మహబూబ్‌నగర్‌(జనంసాక్షి):మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని పాలమూరు జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ’ సభలో సీఎం ప్రసంగించారు. రైతుల కోసం ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. ‘’నవంబరు 29కి ఎంతో ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేశారు. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు ముంబయి, హైదరాబాద్‌కు వలస పోయాయి. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా? వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని గత సీఎం అనలేదా? ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే.. రూ.500 బోనస్‌ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చింది. గత ప్రభుత్వం రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టింది. మూడేళ్లు నిండకుండానే ఆ ప్రాజెక్టు కూలింది. ఈ ఏడాది రాష్ట్రంలో 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల వరి పండిరది. గత ప్రభుత్వం వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఇది. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఇంత రుణమాఫీ చేశారా? అని ప్రధాని మోదీ, కేసీఆర్‌కు సవాల్‌ విసురుతున్నా. రైతులకు ఉచిత కరెంట్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది.
ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా..
గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా.. ప్రాజెక్టులు కట్టలేదా..పరిశ్రమలు నిర్మించలేదా? నా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని భావించాను. కానీ, మాయగాళ్ల మాటలు విని పరిశ్రమలు అడ్డుకుంటున్నారు. వారి మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుక్కున్నారు. జిల్లాను అభివృద్ధి చేయాలంటే భూ సేకరణ చేయాలా? వద్దా? అధికారులను కొడితే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవా? కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు చెప్పే మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇంటికో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం తలరాత మారుతుంది. నష్టపరిహారం ఎక్కువ ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉంది. కానీ, పరిశ్రమల కోసం మాత్రం 1300 ఎకరాల భూమి సేకరించొద్దా. పాలమూరు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. పెండిరగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం మూలన పడేసిన ప్రాజెక్టులను క్రమంగా పూర్తి చేస్తున్నాం: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, యువతకు ఉద్యోగాల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారాస ప్రభుత్వం పదేళ్లలో రైతుల కోసం చేసిందేవిూ లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టినవేనని చెప్పారు. జూరాల, కోయిల్‌సాగర్‌, భీమా వంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే అని అన్నారు. గత ప్రభుత్వం మూలన పడేసిన ప్రాజెక్టులను క్రమంగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిజంగా ఇవాళ రైతు పండుగలా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే పండుగ వాతావరణం నెలకొందని భట్టి తెలిపారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతుపండుగ ముగింపు సభలో భట్టి మాట్లాడారు.’’ప్రతినెలా సవిూక్షలు చేస్తూ బిల్లులు చెల్లిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో సీఎంగా చేసిన కేసీఆర్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కృష్ణా బేసిన్‌ను ఎండబెట్టారు. రూ.లక్షలు ఖర్చు చేసి గోదావరిపై కూలిపోయిన ప్రాజెక్టు కట్టారు. రూ.లక్ష కోట్లు ఖర్చు కట్టిన కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కేసీఆర్‌ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి పదేళ్లలో కూడా పూర్తి చేయలేదు. ఈ ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. నెల రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేశాం. ఆధార్‌, రేషన్‌ కార్డుల్లో సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ సొమ్ము అందలేదు. రుణమాఫీ ఆగిపోయిన వారికి ఇవాళ మళ్లీ ఇచ్చాం’’ అని భట్టి వివరించారు.