Thursday, 5 November 2026

నేరెళ్లకు పలువురు ప్రముఖుల సంతాపం

గవర్న‌ర్‌ నరసింహన్‌ తదితరులు దిగ్భాంతి

హైదరాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు డా.నేరెళ్ల వేణుమాధవ్‌ మృతిపట్ల గవర్నర్‌ నరసింహన్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. నేరెళ్ల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నేరెళ్ల వేణుమాధవ్‌ మృతి కళారంగానికి తీరనిలోటని అన్నారు. నేరెళ్ల వేణుమాధవ్‌ మిమిక్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టారని, మిమిక్రీ కళకు నేరెళ్ల పితామహుడని తెలిపారు. పద్మశ్రీ నెరేళ్ల వేణుమాధవ్‌ మృతిపట్ల ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మిమిక్రి కళకు నెరేళ్ల వేణుమాధవ్‌ చేసిన సేవలు గణనీయమైనవన్నారు. తెలంగాణ బిడ్డగా నెరేళ్ల అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మిమిక్రి కి వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. నేరెళ్ళ వేణుమాధవ్‌ మృతి పట్ల నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌ గా ప్రపంచానికి సుపరిచితుడైన వేణుమాధవ్‌ తెలంగాణ బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో మిమిక్రీ కళాప్రదర్శనలు ఇచ్చిన ఆయన సినిమాల్లోనూ నటించారని, ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వేణుమాధవ్‌ మృతితో మిమిక్రీ లోకం మూగబోయిందన్నారు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు ఎంపీ కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేరెళ్ల వేణుమాధవ్‌ మృతి పట్ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణ ర్రాష్ట్రం ఒక మంచి కళాకారుణ్ణి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఉత్తమ్‌ తెలిపారు.ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ మృతి పట్ల వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అంతర్జాతీయంగా తెలుగువారికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన సర్వబ్రహ్మ నేరెళ్ల మృతి తెలుగు జాతికి తీరని లోటని జగన్‌ అన్నారు. తెలుగు రాష్టాల్రతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు అనేక మంది అభిమానులు ఉన్నారని తెలిపారు. వందలాదిమంది మిమిక్రీ కళాకారులకు నేరెళ్ల మార్గదర్శకాలు చేశారన్నారు. భారతీయ భాషల్లో స్వరానుకరణ, హాలీవుడ్‌ నటుల స్వరాలను కూడా అలవోకగా పలకడంతో పాటు హాస్యాన్ని పండిస్తూ కోట్ల హృదయాలకు చేరువయ్యారని పేర్కొన్నారు. నేరెళ్ల కుటుంబసభ్యులకు జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ నేరెళ్ల మృతి పట్ల సినీనటుడు బ్రహ్మానందం సంతాపం ప్రకటించారు. నేరెళ్ల వేణుమాధవ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. నేరెళ్ల వేణుమాధవ్‌ మృతి దేశానికి తీరనిలోటని బ్రహ్మానందం అన్నారు.