Friday, 6 November 2026

నేలరాలిన నవలా ధృవతార

గుండెపోటుతో మృతి చెందిన యద్దనపూడి సులోచనారాణి
సంతాపం తెలిపిన చంద్రబాబు, కెసిఆర్‌
హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి): నవలాప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార, ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కన్నుమూశారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె శైలజ తెలిపారు. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాసి,నవలాచరిత్రలో తిరుగలేని మహారాణి అనిపించుకున్నారు.  ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి.   కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. యుద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడించారు. ‘నవలా దేశపు రాణి’గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె రాసిన అనేక నవలలు.. సినిమాలు, టీవీ సీరియళ్లుగా తెరకెక్కాయి. విూనా, ఆగమనం, ఆరాధన, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మౌన పోరాటం, మౌనభాష్యం, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేత గులాబి, సెక్రటరీ తదితర నవలలు రచించారు. ఆమె రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల ‘విూనా’. దీని ఆధారంగానే ‘విూనా’ చిత్రం తెరకెక్కింది. సెక్రటరీ యద్దనపూడి సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను, సినిమాగా చిత్రితమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఆలుమగల మధ్య
ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన యద్దనపూడి సులోచనారాణి రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి.  ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సులోచనరాణి సోమవారం ఉదయం కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందారన్న వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  యద్ధనపూడి సులోచనారాణి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నవలా సాహిత్య లోకంలో యద్ధనపూడి ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారన్నారు.