నోటిఫికేషన్ విడుదలైంది .. ఎన్నికలు ఆపలేం
– రిజర్వేషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి
– తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
– నాలుగు వారాలకు తదుపరి విచారణ వాయిదా
హైదరాబాద్, జనవరి3(జనంసాక్షి) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని ఉన్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేతకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య, మరో నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లనన్నింటినీ గురువారం కోర్టు విచారించింది. ప్రధానంగా రిజర్వేషన్ల నిర్ణయాన్ని సవాల్‌గా పిటిషన్లు దాఖలు చేశారు. బీసీల రిజర్వేషన్లు కుదించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేయాలని, ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టేఇవ్వాలని కోర్టును కోరారు. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లను విచారించిన కోర్టు.. ప్రస్తుత దశలో రిజర్వేషన్ల ఆర్డినెన్స్, ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వలేమని, పంచాయతీ ఎన్నికలను ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాజ్యాంగబద్ధమైన హక్కు కాదని కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు అని కోర్టు తేల్చిచెప్పింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికలు ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది.