Wednesday, 4 November 2026

న్యాయవాదుల సహకారం అవసరం

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 8 (జనంసాక్షి): విధి నిర్వహణలో తనకు న్యాయవాదుల సహకారం చాలా అవసరమని అందుకు న్యాయవాదులు తనకు సహకరించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ న్యాయవాదులను కోరారు. సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో నూతన న్యాయమూర్తి కి జరిగిన స్వాగత, పరిచయ కార్యక్రమంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 8 వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని అట్టి కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించడానికి తనతో న్యాయవాదులు సహకరించాలని కోరారు. తనకున్న చట్ట పరిధిలోని పరిమితులకు లోబడి తను న్యాయవాదులకు పూర్తిగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ మాట్లాడుతూ న్యాయ పీఠానికి, న్యాయవాదుల సంఘానికి మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే న్యాయస్థానంలో కార్యకలాపాలు సక్రమంగా జరుగుతాయని తద్వారా సత్ఫలితాలు కలుగుతాయి అన్నారు. అటువంటి మంచి సంబంధాలను కొనసాగించడానికి తమతో న్యాయవాదులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ ను, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్ ను శాలువాలు, పూలమాలలు, బొకేలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోషియేషన్ కృష్ణయ్య, నట్టే సత్యనారాయణ, మాధవరెడ్డి, వొట్టికూటి అంజయ్య, రమణారెడ్డి, కమతం నాగార్జున, క్రాంతి కుమార్, కొట్టు సురేష్, కోలా రమాదేవి, సుంకరి ప్రదీప్తి, పాలేటి శ్రీనివాసరావు, పిడమర్తి చంద్రయ్య, మామిడి వెంకయ్య, సైదా హుస్సేన్, వీరయ్య నరేష్, నగేష్, జక్కుల వీరయ్య, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.