నిధులు, విధులు బదలాయింపు జరగాలి
హైదరాబాద్,అక్టోబర్31(జనంసాక్షి): గ్రామాల్లో పంచాయితీల బలోపేతం గురించి మాట్లాడుతున్న నేతలు ముందుగా పంచాయితీలకు నిధులు, విధులు బదిలీ చేసి చిత్తశుద్ది చాటుకోవాలని మాజీ సర్పంచ్‌లు కోరుతున్నారు. అప్పుడే ఎన్నికలు నిర్వహించినా పంచాయితీలు బలంగా పనిచేస్తాయని, గ్రామ అభివృద్దిలో కీలక భూమిక పోషిస్తాయని అంటున్నారు. కొత్త చట్టం తెచ్చామంటున్న సిఎం కెసిఆర్ ఉన్నచట్టాన్ని ముందు గౌరవించాలని అన్నారు. విధులే తప్ప నిధులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలను తయారు చేశారని ఆరోపించారు. సర్పంచ్ల పదవీకాలం ముగిస్తే ఎన్నికలయ్యే వరకు తమకు కూడా ఆపద్దర్మ సర్పంచ్‌గా ఉండేలా చట్టం ఉండాలన్నారు. గ్రామాల్లో ఏ పని జరగాలన్న పైనుంచి జోక్యం తప్పడం లేదన్నారు. తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పంచాయతీల్లో మౌలిక వసతులు, నీటి సంరక్షణ చర్యలు, ఉపాధి అవకాశాల పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం గుర్తించడం లేదన్నారు. గ్రామ పంచాయతీలకు 29, పట్టణ సంస్థలకు 18 అధికారాలు బదలా యించాల్సిందిగా మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అలా జరగటం లేదన్నారు.
పనులు సవ్యంగా సాగక, చేసిన పనులకు సరైన సమయంలో డబ్బులు విడుదల కాక, అధికారుల మితివిూరిన జోక్యం, గ్రామైక్య భావన లేకపోవడం లాంటి వాటి ద్వారా గ్రామ స్వపరిపాలన కాగితాలకే పరిమితమవుతున్నదన్నారు. అంతే కాకుండా గ్రామ సభల నిర్వహణ, సభ్యుల భాగస్వామ్యం ఎక్కువ శాతం ప్రస్తుతం తంతు లాగా జరుగుతున్న తీరును మార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానం వాడుక, ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. వీలైనంత వరకూ గ్రామ సభ, గ్రామ పంచాయతీ కౌన్సిల్ జరుగుతున్న తీరును రికార్డు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాల వినియోగంలో, గ్రామాభివృద్ధిలో బాగా రాణించే గ్రామ పంచాయతీ, సభ్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.




