ఆదిలాబాద్,నవంబర్22(జనంసాక్షి): సమైక్య రాష్ట్రంలో ఏనాడు వేతన బాధలు పడని చిరుద్యోగులు, కార్మికులు స్వరాష్ట్రమైన తెలంగాణలో మాత్రం దుర్భర పరిస్థితులు ఎదురుచూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. దీనికి తెరాస ప్రభుత్వం బాధత్యని మండిపడ్డారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండగల పేర్లతో కోట్లాది రుపాయాలను తెరాస ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. చెమటోడ్చే కార్మికులు, కర్షకులకు వేతనాల చెల్లింపు, దీర్ఘకాలికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పరిష్కరించడంలేదని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? కార్మికులు కన్నీళ్లు పెట్టుకోవడమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు ఎండుగడుతామన్నారు. కార్మికులు, కర్షకులు, చిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పంచాయితీలను బలోపేతం చేస్తామని చెప్పి వాటిని నీరసించేలా చేశారని అన్నారు. పంచాయతీలు నిధులు లేక నిర్వీర్య మవుతున్నాయని, వాటి బలోపేతానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.




