జనంసాక్షి, మంథని : మంథని నియోజకవర్గంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అన్ని మండలాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాల కురవడం వల్ల నష్టపోయిన రైతులకు, కౌలు రైతుల పంట పొలాలకు భారీగా నీరు చేరి పాక్షికంగా నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తమ నియోజకవర్గంలోని రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి వెంటనే సర్వే చేసి వారికి తగిన నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. గత సంవత్సరంలో భారీగా కురిసిన వర్షాలకు, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన కలిగిన పంట నష్టం పై రెండు, మూడు సార్లు వ్యవసాయ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి తెలిపిన, ఇప్పటివరకు కూడా మా ప్రాంత రైతులకు ఎలాంటి నష్ట పరిహారం అందజేయలేదు అని, ఇప్పటికైనా కాలేశ్వరం బ్యాక్ వాటర్ వలన నష్టపోతున్న రైతులకు కూడా నష్టపరిహారం అందించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెబుతున్న కొన్ని కొనుగోలు సెంటర్స్, రైస్ మిల్లర్స్ కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు,నియోజకవర్గ పరిధిలోని ప్రతి కొనుగోలు కేంద్రాలలో తడిచిన వరి ధాన్యాన్ని రైతుల వద్ద వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్ల ద్వారా రైతుల ధాన్యం కొనుగోలు పై ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని సీఎం శ్రీధర్ బాబు వినతి పత్రంలో కోరారు.




