Monday, 2 November 2026

పంద్రాగస్టు లోగా రైల్వే ట్రాక్ పూర్తి చేయాలి మంత్రి హరీష్ రావు

జనం సాక్షి దుబ్బాకపంద్రాగస్టులోపు 60 రోజులలో సిద్ధిపేటలో రైలు ట్రయల్ రన్ ఉంటుంది. రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులకు రూ.500 కోట్లు కేటాయింపు చేసినట్లు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని, సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.
– హన్మకొండ- మిట్టపల్లి రహదారి పై ఆర్ఓబీ-రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎప్పటిలోపు పూర్తి చేస్తారని అధికారులను ఆరా తీసిన మంత్రి.
– ఎల్కతుర్తి-మెదక్ నేషనల్ హైవే-జాతీయ రహదారి నాలుగు లేన్ల రహదారి నిర్మాణం వస్తున్న దృష్ట్యా, రవాణా యధావిధిగా జరిగేలా సైడ్ లేన్ తీసుకుని ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించాలని ROB-రైల్ ఓవర్ బ్రిడ్జీ నిర్మాణం పై రైల్వే, ఆర్అండ్ బీ అధికారులకు మంత్రి ఆదేశం.మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు 151.4 కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ పనులు ఉన్నాయి. మనోహారబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 32 కిలోమీటర్ల రైల్వే లైన్‌ పనులు పూర్తయ్యాయి. గజ్వేల్ వరకూ రైలు రావడం, రైతులకు మేలు జరిగేలా రేక్ పాయింట్ ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. మరో వైపు గజ్వేల్‌-దుద్దెడ వరకు 32.1 కిలో మీటర్లు సైతం ట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. కుకునూరుపల్లి-దుద్దేడ వరకూ రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ జరిగింది.
ఇక మిగిలిన దుద్దెడ-సిద్ధిపేట మధ్య ఎర్త్‌వర్క్‌ పూర్తయ్యింది.
దుద్దెడ-సిద్ధిపేట-సిరిసిల్ల 48.65 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణ పనులు పురోగతితో శరవేగంగా జరుగుతున్నాయి. వీటిలో దుద్దెడ-సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ రైల్వే ట్రాక్ దాదాపు పూర్తయ్యింది.
అలాగే సిద్ధిపేట-సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 38.6 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ పనులు చేపట్టాల్సి ఉన్నది. మరోవైపు దుద్దెడ నుంచి సిద్ధిపేట వరకు ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తయి మరో 60 రోజులలో సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ వరకూ రైల్వే సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహణ ఉంటుంది. ఈ క్రమంలో సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులకు రూ.500 కోట్లు కేటాయింపు చేసినట్లు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని, సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు.