Wednesday, 4 November 2026

పట్టణ ప్రగతితో సర్వాంగ సుందరంగా పట్టణం. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, జూన్ 16, (జనంసాక్షి )
పట్టణ ప్రగతి కార్యక్రమం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు అన్ని సర్వాంగ సుందరంగా మారాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి ఉత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేసుకున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించుకున్నామని, జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్ ను నియమించి పల్లె, పట్టణ ప్రగతిని పర్యవేక్షిస్తున్నట్టు ఆయన వివరించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మార్కెట్ యార్డులు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు నిర్మించుకున్నామన్నారు. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పరిరక్షణకు 10 శాతం బడ్జెట్ కేటాయించామన్నారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచి, వారి ద్వారా నిరంతరం పారిశుధ్య పనులు చేపడుతున్నామని వివరించారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రహదారుల నిర్మాణంలో ఎప్పుడు లేని అభివృద్ధి సాధించామని తెలిపారు. స్వచ్ఛ సంరక్షణలో బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు. ప్రజలకు క్షేత్ర స్థాయిలో వైద్య సేవల కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో 6700మందికి ఇళ్ల పట్టాలు అందజేశామని, పట్టాల కోసం దరఖాస్తు చేసుకోని వారు ఈనెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం 350 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. బెల్లంపల్లిలో ఐటీ కంపెనీ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని ఈసందర్భంగా గుర్తు చేశారు. అమెరికాలో బెల్లంపల్లి పేరును మంత్రి కేటీఆర్ ప్రస్తావించడం బెల్లంపల్లి పట్టణానికే గర్వకారణం అన్నారు. స్వయం సహాయక సంఘాలకు 3 కోట్ల చెక్కును అందజేశారు. వివిధ రంగాల్లో పనిచేసిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు అందజేశారు. ఈకార్యక్రమానికి ముందు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేశారు. పట్టణంలో బతుకమ్మలతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, ఆర్డివో శ్యామల దేవి, తహసీల్దార్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, సీడీపీఓ ఉమాదేవి, 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి కుమార్, మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, అధికారులు,ఇతర ప్రజాప్రతినిధులు, బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.