పత్తి గోదాంలో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు(జ‌నం సాక్షి): గుంటూరు జిల్లా పెదకాకానిలోని వాసవీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి గోదాంలో మంటలు చెలరేగి వేలాది పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌కారణంగానే మంటలు చెలరేగినట్టు సమాచారం. ఘటనాస్థలికి ఏడు ఫైరింజన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మిగతా బ్లాకులకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదంలో దాదాపు ఆరు వేల పత్తిబేళ్లు దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు రూ.12 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. నాలుగు పెద్ద గోదాముల ఈ సముదాయంలో.. మధ్య గోదాములో మంటలు చెలరేగడంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారమందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. నరసరావుపేట, విజయవాడ, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు. అయితే మొదటి గోదాము, నాలుగో గోదాములో పాక్షికంగా మంటలు వ్యాపించినప్పటికీ.. మధ్య గోదాము మాత్రం పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు.

తాజావార్తలు