– స్పష్టం చేసిన సుప్రింకోర్టు
– పద్మావత్‌కు సుప్రీంలో మళ్లీ ఊరట!
– ఆందోళనలు ఉదృతం చేసిన కర్ణిసేన
న్యూఢిల్లీ, జనవరి23(జనంసాక్షి) : ‘పద్మావత్’ సినిమాకు సుప్రీం కోర్టు తీర్పు మరోసారి ఊరటనిచ్చింది. ఈ చిత్రం విడుదల గురించి మరోసారి ఆలోచించాలని కోరుతూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తమ రాష్టాల్లో సినిమా విడుదలను ఆపాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ‘పద్మావత్’ సినిమాపై ఎలాంటి నిషేధం విధించలేమని తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణా రాష్టాల్రు తమ రాష్టాల్ల్రో అనేక వివాదాలు ఎదుర్కొంటున్న ‘పద్మావత్’ విడుదలను నిషేధిస్తున్నట్లు మొదట వెల్లడించాయి. దీంతో చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన న్యాయస్థానం సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అన్ని రాష్టాల్లో విడుదల చేయాల్సిందేనని ఆదేశించింది. ఆందోళనలు జరుగుతాయని చిత్రాన్ని ఆపకూడదని, ప్రజల్ని రక్షించి, ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని పేర్కొంది. అయితే ఈ తీర్పును పునఃపరిశీలించమని మధ్యప్రదేశ్, రాజస్థాన్ సోమవారం పిటిషన్ దాఖలు చేశాయి. రాజ్‌పుత్ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమాను తెరకెక్కించారు. దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ ప్రధాన తారాగణంగా నటించారు. ఇందులో తమ దేవతలాంటి పద్మిని గురించి తప్పుగా చూపిస్తున్నారని, చరిత్రను వక్రీకరించారని రాజ్‌పుత్ కర్ణిసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే సినిమాను చూడకుండా, భన్సాలీ మహారాణి పద్మిని గురించి ఏం చూపించారో తెలియకుండా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మరికొందరు తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే సుప్రింకోర్టు తీర్పు ఇచ్చినా కర్ణిసేన తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేయనివ్వమని, ఒకవేళ సినిమా ప్రదర్శిస్తే ఆ థియేటర్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు పద్మావత్ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎలాంటి భద్రత కల్పిస్తారో వేచి చూడాల్సిందే.




