Wednesday, 4 November 2026

పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ధి

పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ధి
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు
మిర్యాలగూడ, జనం సాక్షి.
పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. గురువారం దామరచర్ల మండలంలోని ఇరికిగూడెం గ్రామంలో 720 కోట్ల రూపాయలతో నిర్మించ నున్న ఫెర్రో అల్లాయ్, స్టీల్ కాంప్లెక్స్ పరిశ్రమలతో పాటు థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, స్థానికులకు ఉద్యోగాలు కూడా లభిస్తాయని అన్నారు. పరిశ్రమను ఏర్పాటు చేసేవారు నివేదికలో సమర్పించిన ప్రకారం నిర్మాణాలు చేపట్టి పరిశ్రమల నుండి ఎలాంటి కాలుష్యం వెలువడ కుండ ముందునుండే జాగ్రత్తలు చేపట్టాలని ఎమ్మెల్యే యాజమాన్యాన్ని కోరారు. అదేవిధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ పరిశ్రమల కారణంగా పరిసర ప్రాంతాల్లో పంటలకు ఏమాత్రం నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాని దేనని సూచించారు. మీరు నిర్మించే ఈ పరిశ్రమలో క్రోమియం ప్లాంటు నిర్మిస్తున్నారని తెలిసిందని ఒకవేళ అదే జరిగితే మాత్రం తమ ప్రజల ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని హెచ్చరించారు. పరిశ్రమలు ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని స్థానికులు ఆశ పడతారని అన్నారు. ఈ పరిశ్రమల నిర్మాణం ద్వారా జన వాయు కాలుష్యాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం దేనని దామచర్ల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వేరే కోటిరెడ్డి, దామరచర్ల సర్పంచ్ కిరణ్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీవో బి.చెన్నయ్య. కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ సురేష్ బాబు, ఎంపీపీ నందిని రవితేజ, జడ్పిటిసి లలిత హతిరం. ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు